‘టీమ్ అంతా ప్రాణం పెట్టి పనిచేసిన సినిమా ఇది. ఈ మూవీలో కోర్ట్ డ్రామాతో పాటు సస్పెన్స్ బాగుంటుంది. ఈ సినిమా సహజత్వానికి దగ్గరగా ఉంటుంది. కంటెంట్ స్ట్రాంగ్‌గా ఉంటుంది. 19న వస్తున్నాం. అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది’ అని వడ్డే నవీన్ ఆశాభావం వెలిబుచ్చారు. ఆయన కథానాయకుడిగా నటిస్తూ నిర్మించిన చిత్రం ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’. రాశీసింగ్, శిల్పా తులస్కర్ కథానాయికలు. కమల్‌తేజ నార్ల దర్శకుడు.
ఈ నెల 19న సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో వడ్డే నవీన్ మాట్లాడారు. ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన అగ్ర దర్శకుడు వి.వి.వినాయక్ చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. టీమ్ అంతా ఎంతో ఇష్టంతో, కష్టపడి చేసిన సినిమా ఇదని దర్శకుడు కమల్‌తేజ నార్ల చెప్పారు. ఇంకా కథానాయిక రాశీసింగ్, సంగీత దర్శకుడు కల్యాణ్ నాయక్, విజయ్ పొలాకి, డీవోపీ కార్తీక్ సుజాత, కళా దర్శకుడు భిక్షపతి కందకట్ల కూడా మాట్లాడారు.