Ustad Bhagat Singh | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన భారీ చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదలకు సిద్ధమైంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచి ఎన్నో రికార్డులు సృష్టించింది. దీంతో ఇప్పుడు వస్తున్న ఈ సినిమా పట్ల అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఉగాది కానుకగా మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రమోషన్స్‌ను చిత్ర బృందం ఇప్పటికే వేగవంతం చేసింది. త్వరలోనే ట్రైలర్‌ను కూడా విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సినిమాకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది.
సినిమా విడుదల రోజు తెల్లవారుజామున ఉదయం 4 నుంచి 5 గంటల మధ్య బెనిఫిట్ షో నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది. ఈ ప్రత్యేక ప్రదర్శనకు టికెట్ ధరను రూ.500గా నిర్ణయించారు. అంతేకాకుండా విడుదలైన తర్వాత పది రోజుల పాటు టికెట్ ధరలను పెంచుకునే అవకాశం కూడా ప్రభుత్వం కల్పించింది.ప్రభుత్వం ఇచ్చిన అనుమతి ప్రకారం సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.100, మల్టీప్లెక్స్‌లలో రూ.125 వరకు అదనంగా వసూలు చేయవచ్చు. ఈ పెంపు మార్చి 19 నుంచి మార్చి 28 వరకు అమల్లో ఉండనుంది. ఇటీవల కాలంలో అగ్ర హీరోల సినిమాలకు ‘స్పెషల్ ప్రీమియర్ షో’ల పేరుతో విడుదలకు ముందు రోజే ప్రదర్శనలు ఏర్పాటు చేసే ట్రెండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’కు కూడా విడుదలకు ముందురోజు షోలు ఉంటాయా లేదా అన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.
ఇక సినిమా విషయానికి వస్తే, ఇటీవలే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ఎలాంటి కట్స్ లేకుండా యూ/ఏ సర్టిఫికేట్ లభించినట్లు చిత్రబృందం ప్రకటించింది. సినిమా రన్ టైమ్ 2 గంటల 34 నిమిషాలుగా ఉందని సమాచారం. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా అభిమానులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.