అగ్ర హీరో పవన్‌కల్యాణ్ తాజా సినిమా ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ ఈ వేసవిలో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతున్నది. త్వరలో రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ నిర్మాణానంతర కార్యక్రమాలను ముమ్మరం చేశారు. మంగళవారం డబ్బింగ్ పనులను ప్రారంభించారు. పవన్‌కల్యాణ్ త్వరలో డబ్బింగ్ కార్యక్రమాల్లో పాల్గొంటారని మేకర్స్ తెలిపారు. మాస్, పంచ్ డైలాగ్స్‌ను రాయడంలో దిట్ట అయిన దర్శకుడు హరీశ్‌శంకర్ ఈ సినిమా కోసం మరింత పదునైన సంభాషణలను రాశారని, అభిమానులతో ఈలలు వేయించేలా డైలాగ్స్ ఉంటాయని చిత్రబృందం చెబుతున్నది.
‘గబ్బర్‌సింగ్’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత పవన్‌కల్యాణ్-హరీశ్‌శంకర్ ద్వయం ఈ సినిమా చేస్తుండటంతో అంచనాలు తారాస్థాయికి చేరాయి. ‘దేఖ్లేంగే సాలా’ పాట రికార్డు స్థాయి వీక్షణలతో సోషల్‌మీడియాలో సంచలనం సృష్టించింది. శ్రీలీల, రాశీఖన్నా కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఆర్ట్: ఆనంద్‌సాయి, నిర్మాణ సంస్థ: మైత్రీ మూవీ మేకర్స్, నిర్మాతలు: నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, రచన-దర్శకత్వం: హరీష్‌శంకర్ ఎస్.