అగ్ర హీరో పవన్‌కల్యాణ్ రాజకీయ కార్యకలాపాలకు కాస్త విరామమిచ్చి వరుసగా తన సినిమాల్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఇటీవలే ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) సినిమా సెట్లోకి అడుగుపెట్టారాయన. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుగుతున్నది. తాజాగా ఆయన ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ షూట్లో జాయిన్ అయ్యారు. హరీష్‌శంకర్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతున్నది. పవన్‌కల్యాణ్‌తో పాటు ప్రధాన తారాగణంపై కీలక ఘట్టాలను తెరకెక్కించబోతున్నారు.
సుదీర్ఘ విరామం తర్వాత ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ సెట్లో పవన్‌కల్యాణ్ ఎంట్రీ ఇవ్వడంతో యూనిట్ సభ్యుల్లో జోష్ కనిపిస్తున్నదని మేకర్స్ తెలిపారు. ‘గబ్బర్‌సింగ్ ’ (2012) వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత పవన్‌కల్యాణ్-హరీష్‌శంకర్ కాంబోలో రూపొందుతున్న ‘ఉస్తాద్ భగత్‌సింగ్’పై ప్రేక్షకులు భారీ అంచనాల్ని పెట్టుకున్నారు. శ్రీలీల కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఆయనంక బోస్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, నిర్మాతలు: నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, రచన-దర్శకత్వం: హరీష్‌శంకర్.ఎస్.