Ustaad Bhagat Singh | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన రాజకీయ బాధ్యతలతో పాటు సినిమాలపై కూడా పూర్తి ఫోకస్ పెట్టారు. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా, తన కమిట్ అయిన సినిమాలకు సమయం కేటాయిస్తున్నారు. ఈ క్రమంలో చాలా కాలంగా వేచిచూస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ మళ్లీ ప్రారంభమైంది. ఈ సినిమాను హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. 2023లోనే సినిమా ప్రారంభమై, కొన్ని షెడ్యూల్స్ పూర్తయ్యాయి. అయితే ఎన్నికల నేపథ్యంతో చిత్రానికి బ్రేక్ పడింది. ఇటీవల తిరిగి షూటింగ్ ప్రారంభం కాగా, చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది.
అయితే ఈ మూవీ కథను రాజకీయ నేపథ్యంతో సిద్ధం చేసి, అప్పటి ఎన్నికల వాతావరణానికి అనుగుణంగా రూపొందించారు. పవన్ కళ్యాణ్ రాజకీయ సందేశాలను, ప్రజలలో ఆవశ్యకంగా పంచాలనుకున్న విషయాలను ఈ చిత్రంలో ప్రస్తావించేందుకు దర్శకుడు ప్రణాళిక వేసినట్లు సమాచారం. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో ఉన్నందున, అతడి బాధ్యతలతో సమన్వయం కోసం, కథను పూర్తిగా మళ్లీ డిజైన్ చేశారని సమాచారం. రాజకీయ డైలాగులు, ఎన్నికల నేపథ్యంలో ఉన్న సీన్లను తొలగించి, ప్రేక్షకులను ఆకట్టుకునే ఇంట్రెస్టింగ్ సీన్లను చేర్చినట్టు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ తమ్ముడు, ఖుషి రోజులను గుర్తు చేసే విధంగా యంగ్ లుక్లో కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన కొన్ని స్టిల్స్, లుక్స్ చూసిన అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా పోస్టర్ విడుదల చేశారు. ఇందులో పవన్ కళ్యాణ్ లుక్ అభిమానులని ఆకట్టుకుంటుంది. ఏదో పాటలోని స్టిల్ ఇది కాగా, ఇది ఫ్యాన్స్కి తెగ నచ్చేసింది. ఈ పోస్టర్ని తెగ వైరల్ చేస్తున్నారు. ఇక పవన్ నటించిన “ఓజీ” సెప్టెంబర్ 25, 2025న విడుదలవుతుండగా, “ఉస్తాద్ భగత్ సింగ్” సినిమాను 2026 సమ్మర్ కి విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.