Ustaad Bhagat Singh | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో భారీ అంచనాల మధ్య విడుదలైన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ అందుకుంది. ఉగాది పండుగ సందర్భంగా విడుదలైన ఈ చిత్రం తొలి రోజు అదిరిపోయే వసూళ్లు సాధించినప్పటికీ, రెండో రోజు మాత్రం తీవ్రంగా పడిపోయాయి. సినిమా రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.59 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇందులో ఇండియాలోనే రూ.52 కోట్ల వరకు వసూళ్లు వచ్చాయి. అయితే రోజు వారీగా చూస్తే కలెక్షన్స్‌లో భారీ డ్రాప్ స్పష్టంగా కనిపిస్తోంది. Sacnilk.com రిపోర్ట్ ప్రకారం ఈ మూవీ తొలి రోజు ఇండియాలో ఈ సినిమా రూ.34.75 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. కానీ రెండో రోజు మాత్రం కేవలం రూ.9.25 కోట్లకే పరిమితమైంది.
దీంతో రెండు రోజుల్లో మొత్తం ఇండియా నెట్ కలెక్షన్స్ రూ.44 కోట్లకు చేరాయి. ఓవర్సీస్ మార్కెట్ నుంచి సుమారు రూ.7 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు సమాచారం. రెండో రోజు కలెక్షన్స్ పడిపోవడానికి పలు కారణాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సినిమాకు వచ్చిన మిక్స్డ్ టాక్ , అలాగే వర్కింగ్ డే కావడం కూడా కలెక్షన్స్‌పై ప్రభావం చూపింది. దీనికి తోడు రణ్వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్ 2’ హిందీ వెర్షన్ ప్రభావం కూడా ముఖ్యంగా నైజాం ప్రాంతంలో కనిపించింది. ఇప్పటికే తొలి రెండు రోజుల్లో వచ్చిన ట్రెండ్‌ను బట్టి చూస్తే, ఈ సినిమాకు వీకెండ్ చాలా కీలకం కానుంది. రంజాన్ సెలవులు, శని-ఆదివారాల్లో వసూళ్లు పెరిగితేనే ఈ చిత్రం హిట్ ట్రాక్‌లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
అయితే పరిస్థితి అంత సులభంగా కనిపించడం లేదు. ‘ధురంధర్ 2’ తెలుగు వెర్షన్ కూడా విడుదలవుతున్న నేపథ్యంలో పోటీ మరింత పెరగనుంది. ఇప్పటికే హిందీ వెర్షన్ ప్రభావం ఉన్న చోట్ల ఇప్పుడు తెలుగు వెర్షన్ కూడా రావడం ‘ఉస్తాద్ భగత్ సింగ్’కు సవాలుగా మారింది. పవన్ కళ్యాణ్ గత చిత్రం ‘ఓజీ’ బ్లాక్‌బస్టర్ తర్వాత వచ్చిన ఈ సినిమా నుంచి అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ ప్రస్తుత ట్రెండ్ చూస్తే, ఈ సినిమా భవితవ్యం పూర్తిగా వీకెండ్ కలెక్షన్స్‌పైనే ఆధారపడి ఉంది.