కన్నడ అగ్ర నటుడు ఉపేంద్రను ప్రయోగాత్మక చిత్రాలకు చిరునామాగా అభివర్ణిస్తారు. ఆయన చిత్రాలన్నీ సోషల్ సెటైర్‌తో మనిషి తాలూకు నిగూఢమైన వ్యక్తిత్వానికి దర్పణంలా కనిపిస్తాయి. దర్శకుడిగా, నటుడిగా దక్షిణాది చిత్రసీమలో ఆయనది ప్రత్యేకమైన ముద్ర. ప్రస్తుతం ఆయన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ చిత్రంలో కీలక పాత్రను పోషిస్తున్నారు. రామ్ హీరోగా మహేష్‌బాబు పి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకురానుంది. అభిమాని కథగా రూపొందుతున్న ఈ చిత్రంలో ఉపేంద్ర వెండితెర సూపర్‌స్టార్ సూర్య పాత్రలో కనిపించనున్నారు. చిత్ర విడుదలను పురస్కరించుకొని మంగళవారం ఉపేంద్ర విలేకరులతో సినిమా సంగతుల్ని పంచుకున్నారు.