Upasana | సంక్రాంతి 2026 కానుకగా జనవరి 12న థియేటర్లలోకి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా అన్ని వైపుల నుంచి బ్లాక్‌బస్టర్ టాక్‌ను సొంతం చేసుకుంటోంది. విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ రివ్యూలు వెల్లువెత్తుతుండగా, ఫ్యాన్స్‌తో పాటు కుటుంబ ప్రేక్షకులు కూడా సినిమాను భారీగా ఆదరిస్తున్నారు. చాలా కాలం తర్వాత చిరంజీవిని వింటేజ్ లుక్‌లో, పూర్తి స్థాయి ఎంటర్టైనర్లో చూడటం అభిమానులకు ప్రత్యేక ఆనందాన్ని ఇస్తోంది. ఈ విజయోత్సాహంలో తాజాగా మెగా కుటుంబం నుంచే మరో స్పెషల్ రియాక్షన్ వచ్చింది. మెగా కోడలు ఉపాసన కొణిదెల తన మామయ్య చిరంజీవి నటనపై ప్రశంసల వర్షం కురిపించారు. సినిమాను చూసిన అనంతరం ఆమె సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, ఇది “మెగా సంక్రాంతి” అంటూ పేర్కొన్నారు. చిరంజీవి యాక్టింగ్, స్టైల్, స్క్రీన్ ప్రెజెన్స్ తనను బాగా ఇంప్రెస్ చేశాయని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఉపాసన తన ఎక్స్ (X) ఖాతాలో చిరంజీవి స్టైలిష్ ఎంట్రీ సీన్‌కు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ, “ఇది మెగా సంక్రాంతి… హార్టీ కంగ్రాచ్యులేషన్స్ మామయ్య” అని పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా చిరంజీవితో పాటు నయనతార, సుస్మిత కొణిదెలలను కూడా ట్యాగ్ చేయడం విశేషం. ఉపాసన చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ మధ్య వైరల్ అవుతోంది. సినిమాకు వస్తున్న రెస్పాన్స్ కూడా అదే స్థాయిలో ఉంది. చిరంజీవి వింటేజ్ లుక్‌లో చేసిన కామెడీ, యాక్షన్, ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. “పక్కా పండగ సినిమా”, “సంక్రాంతి 2026 విన్నర్” అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా నిలిచిందని విమర్శకులు కూడా అభిప్రాయపడుతున్నారు.
ఈ సినిమాలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్గా నటించగా, విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో కనిపించారు. అలాగే కేథరిన్ థెరిసా తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. సాహు గారపాటి, సుస్మిత కొణిదెల కలిసి షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మించారు. కథ విషయానికి వస్తే, ‘మన శంకర వరప్రసాద్ గారు’లో చిరంజీవి ఒక ఇండియన్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా నటించారు. దేశంలోని కీలక వ్యక్తుల భద్రత బాధ్యతలు ఆయన భుజాలపై ఉంటాయి. ఈ క్రమంలో శశిరేఖ (నయనతార)తో వివాహం జరిగినా, విధి నిర్వహణ కారణంగా కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో భార్యాభర్తల మధ్య ఏర్పడిన దూరం, దానికి కారణాలు, చివరకు వారి ప్రయాణం ఎలా ముగుస్తుంది అన్నదే కథాంశం. మొత్తంగా చిరంజీవి వింటేజ్ స్టైల్‌ను మిస్ అయినవారికి ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఒక ఫుల్ మీల్లా మారిందని చెప్పొచ్చు. కామెడీ, యాక్షన్, ఎమోషన్ అన్నీ కలిసిన ఈ సినిమా సంక్రాంతి సీజన్లో థియేటర్లలో సందడి చేస్తూ దూసుకుపోతోంది.