Bipasha Basu | బాలీవుడ్ నటి బిపాషా బసుపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి నటి మృణాల్ ఠాకుర్ ప్రస్తుతం వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. కొన్ని సంవత్సరాల క్రితం మృణాల్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బిపాషా బసు ‘కండలు తిరిగిన పురుషుడిలా ఉంటుందని’.. తాను బిపాషా కంటే అందంగా ఉంటానని చెప్పుకోచ్చింది. అయితే ఈ వీడియో వైరల్ కావడంతో పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు మృణాల్ మాటలను తప్పుపట్టడంతో పాటు ఆమెను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. బిపాషా కూడా దీనిపై పరోక్షంగా స్పందిస్తూ.. మహిళలంతా దృఢంగా ఉండాలి. అప్పుడే వారు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. అమ్మాయిలు శారీరకంగా బలంగా కనిపించకూడదు.. అనే పాతకాలపు ఆలోచనల నుంచి బయటకు రావాలంటూ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే వివాదం ముదరడంతో మృణాల్ తాజాగా క్షమాపణలు చెప్పింది. తాను 19 ఏళ్ల వయసులో టీనేజర్‌గా ఉన్నప్పుడు అమాయకంగా, ఆలోచించకుండా ఆ మాటలు మాట్లాడానని, ఎవరినీ అవమానించే ఉద్దేశం తనకు లేదని మృణాలు వివరించారు.
అయితే ఈ వివాదంపై ఉర్ఫీ జావేద్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో స్పందిస్తూ.. మృణాల్‌కి మద్దతుగా నిలిచింది.
మనం యువకులుగా ఉన్నప్పుడు మనం ఏం మాట్లాడతామో మనకి అంతగా తెలియదు. ప్రతిరోజూ మనం నేర్చుకుంటూ, ఎదుగుతూ ఉంటాం. గతంలో మనం మాట్లాడిన విషయాలతో ఇప్పుడు మనం ఏకీభవించకపోవచ్చు. ఎందుకంటే మనం మారతాం, మన ఆలోచనలు, నైతిక విలువలు కూడా మారుతాయి. నేను కూడా గతంలో ఇలాంటి కొన్ని విషయాలు మాట్లాడాను, వాటిని నేను ఇప్పుడు గుర్తు చేసుకుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది అంటూ ఉర్ఫీ రాసుకోచ్చింది.