సినిమా అనేది వ్యాపారం. ఎవరైనా తీసేది డబ్బుకోసమే. కానీ నమ్మిన సిద్ధాంతం కోసం, అనుసరించే భావాజాలం కోసం, తాడితపీడిత ప్రజానీకం గొంతుగా సినిమా తీసేవాళ్లు దేశంలో ఒక్కరే ఉన్నారు. ఆయనే ఆర్.నారాయణమూర్తి. ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘యూనివర్సిటీ’. ఈ నెల 13న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నారాయణమూర్తి మాట్లాడుతూ- “ నేటి విద్యావ్యవస్థని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లంబకోణాలు నేర్పిన వాళ్లే కుంభకోణాలు చేస్తూవుంటే విద్యార్థులంతా రెక్కలు తెగిన పావురాల్లా విలవిల లాడుతున్నారు.
ఊపిరాడక నేలకొరుగుతున్నారు. ఇలా అయితే వారిపై ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులు ఏమైపోవాలి? పాఠాలు నేర్పిన గురువులు ఏమైపోవాలి?’ అంటూ ప్రశ్నించారు. ‘సంవత్సరానికి రెండుకోట్ల్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మోడీగారూ.. దయచేసి ఇవ్వండి. ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ ప్రైవేటీకరణ చేసుకుంటూపోతే యువతకు ఉద్యోగాలెలా వస్తాయి? యువతరం జాతి సంపద. వారిని రక్షించుకునే బాధ్యత మనపై ఉంది. నా ‘యూనివర్సీటీ’ సినిమా కథాంశం ఇదే’ అన్నారు నారాయణమూర్తి. ఇంకా కెమెరామెన్ బాబూరావు దాస్, ఎడిటర్ మాలిక్, కవిగాయకుడు విజయ్ కూడా పాల్గొన్నారు. స్వర్గీయ గద్దర్, జలదంకి సుధాకర్, వేల్పుల నారాయణ, మోటపలుకులు రమేష్, ములుగు విజయ్ ఈ సినిమాకు పాటలు రాశారు.