ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితంపై రూపొందించిన డాక్యుమెంటరీ చిత్రం ‘యూనిటీ’ (ది మ్యాన్ ఆఫ్ సోషల్ జస్టిస్’). బడుగు విజయ్‌కుమార్ దర్శకత్వం వహించారు. చిరందాస్ ధనుంజయ నిర్మాత. శనివారం ఈ చిత్ర ట్రైలర్‌ను రవీంద్రభారతి పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్లో మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్, ఎమ్మెల్సీ ఎల్.రమణ, తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ ఆవిష్కరించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకొని ఈ నెల 27వ తేదీన ఈ డాక్యుమెంటరీ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. తెలంగాణ జాతిపితగా అభివర్ణించే కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితానికి సంబంధించిన అనేక ముఖ్య ఘట్టాలను ఈ చిత్రంలో ఆవిష్కరించామని దర్శకుడు బడుగు విజయ్‌కుమార్ తెలిపారు. ఈ చిత్రాన్ని ప్రజలకు చేరువ చేసేందుకు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి సహకారం తీసుకుంటామని ఎమ్మెల్సీ ఎల్.రమణ అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం అందరికి స్ఫూర్తిదాయకమని మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ పేర్కొన్నారు. ఈ కార్యకమ్రంలో చిత్ర నటీనటులు మైమ్ మధు, మాస్టర్ భాను తదితరులు పాల్గొన్నారు.