Suresh Gopi | కేంద్ర సహాయ మంత్రి, ప్రముఖ సినీ నటుడు సురేశ్ గోపీపై కేసు నమోదైంది. ట్రాఫిక్ ఉల్లంఘిస్తూ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడంతో పాటు అబులెన్స్ని దుర్వినియోగం చేశారన్న అభియోగాలపై కేరళ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 20న త్రిస్పూర్పురంలోని స్వరాజ్ మైదానానికి ఆయన అంబులెన్స్‌లో చేరుకున్నారు. వన్ వే రోడ్డులో ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే, అత్యవసర పరిస్థితుల్లో రోగులను తరలించేందుకు వినియోగించే అంబులెన్స్‌లో ప్రయాణించడం వివాదాస్పదంగా మారింది. అయితే, ఆ సమయంలో ఆయన అనారోగ్య సమస్యలతోనే అంబులెన్స్‌లో వచ్చినట్లుగా వివరణ ఇచ్చారు.
కాలు నొప్పి ఉందని.. దాంతో జనాల్లో నడవలేనంటే రాజకీయ ప్రయోజనాలు లేని కొందరు యువజనులు తనకు అంబులెన్స్‌లో సమకూర్చారని చెప్పారు. కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన నేత ఫిర్యాదు మేరకు సురేశ్ గోపీపై కేసు నమోదైంది. బీఎన్ఎస్ 279, 34 సెక్షన్లు, మోటారు వాహనాల చట్టం కింద 179, 184, 188, 192 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సురేశ్ గోపీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మలయాళ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరో. ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేసి బీజేపీ తరఫున పోటీ చేసి లోక్‌సభకు ఎన్నికైన నేత తొలినేత ఆయనే. ప్రస్తుతం ఆయన మోదీ ప్రభుత్వంలో పెట్రోలియం శాఖ సహాయమంత్రిగా పని చేస్తున్నారు.