UK PM Keir Starmer – Adolescence | ఇంగ్లాండ్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ ట్రెండింగ్‌లో ఉన్న ‘అడాల్సెన్స్’ అనే వెబ్ సిరీస్‌ను బ్రిటన్‌లోని అన్ని పాఠశాలల్లో ప్రదర్శించాలంటూ ఆదేశాలు జారీ చేశాడు. ఈ సిరీస్‌ను తెరకెక్కించిన జేక్ థ్రోర్న్, స్టీఫెన్ గ్రాహమ్లను డౌనింగ్ స్ట్రీట్‌కు ఆహ్వానించిన ప్రధానమంత్రి, పిల్లల రక్షణపై సుదీర్ఘ చర్చ జరిపారు. అనంతరం యూకేలోని అన్ని సెకండరీ పాఠశాలల్లో ఈ సిరీస్‌ను ఉచితంగా ప్రదర్శించేందుకు ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌ను ప్రధానమంత్రి ఆదేశించినట్లు ఆయన కార్యాలయం ప్రకటించింది. ఈ నిర్ణయం వల్ల ఎక్కువ సంఖ్యలో బాలలు ఈ సిరీస్‌ను వీక్షించే అవకాశం లభిస్తుందని వారు వెల్లడించారు.
నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిన “అడాల్సెన్స్”(Adolescence) అనే బ్రిటీష్ వెబ్ సిరీస్‌పై ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ వెబ్ సిరీస్‌పై బాలీవుడ్ ప్రముఖులు కరణ్ జోహార్, అనురాగ్ కశ్యప్‌తో పాటు అలియా భట్ ప్రశంసలు కురిపించారు.
ఈ వెబ్ సిరీస్ కథ విషయానికి వస్తే.. ఈ సిరీస్ 13 ఏళ్ల బాలుడు జమీ చుట్టూ తిరుగుతుంది. కేటీ అనే బాలిక స్కూల్ పరిసరాల్లో దారుణ హత్యకు గురవడంతో.. ఈ నేరం కింద జమీని పోలీసులు అరెస్ట్ చేస్తారు. అనంతరం అతడు హత్య చేయడానికి గల కారణాన్ని విచారిస్తారు పోలీసులు. అయితే ఈ విచారణలో జమీ హత్య చేశాడా.. అసలు ఎందుకు హత్య చేశాడు.. దానికి గల కారణం ఏంటి. ఈ హత్య అతని జీవితాన్ని, అతని చుట్టూ ఉన్నవారి జీవితాలను ఎలా ప్రభావితం చేసిందనేది ఈ కథలోని ముఖ్యాంశం. మొత్తం మూడు ఎపిసోడ్లుగా విడుదలైన ఈ చిత్రం ఒక్కొక్కటి గంట నిడివిని కలిగి ఉంది. అలాగే రియాలీటికి దగ్గరగా ఉండాలని ప్రతి ఎపిసోడ్‌ను సింగిల్ షాట్లో చిత్రీకరించారు మేకర్స్. మొదటి ఎపిసోడ్ పోలీస్ స్టేషన్లో జరుగగా.. రెండోది స్కూల్ వాతావరణంలో. మూడోది జైలు నేపథ్యంలో సాగుతుంది. ఈ మూడు వేర్వేరు ప్రదేశాలు జమీ జీవితంలోని విభిన్న కోణాలను, అతని మానసిక పరిణామాన్ని చూపిస్తాయి. ఈ డిజిటల్ యుగంలో ఆన్‌లైన్‌కి అలవాటు పడిన పిల్లలు ప్రస్తుతం ఏం చేస్తున్నారు అనే స్టోరీతో ఈ సిరీస్ వచ్చింది. టీనేజీ యువత ఎదుర్కోంటున్న అతిపెద్ద సమస్యను ఈ సిరీస్‌లో చూపించారు మేకర్స్.