Upendra | కన్నడ నటుడు ఉపేంద్ర సతీమణి ప్రియాంక ఉపేంద్ర ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఉగ్రావతారం’. గురుమూర్తి దర్శకత్వంలో ఎస్.జి.సతీష్ నిర్మిస్తున్నారు. గురువారం ఈ సినిమా ట్రైలర్‌ను నిర్మాత రాజ్ కందుకూరి లాంచ్ చేశారు. కరాటే రాజు, సత్యప్రకాష్ పాటను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ప్రియాంక ఉపేంద్ర మాట్లాడుతూ ‘నాకు హైదరాబాద్‌తో ఎంతో అనుబంధం ఉంది. ఉపేంద్రగారిని తొలిసారి ఇక్కడే చూశాను. హైదరాబాద్‌ను నా లక్కీ సిటీగా భావిస్తాను. నా కెరీర్లో తొలి యాక్షన్ ఫిల్మ్ ఇది’ అని చెప్పింది. సమాజంలో జరిగే అన్యాయాలను, అక్రమాలను ధైర్యవంతురాలైన యువతి ఎలా ఎదిరించింది? కాళీమాతలా దుష్టశిక్షణ ఎలా చేసిందన్నదే ఈ చిత్ర ఇతివృత్తమని, చక్కటి సందేశంతో ఆకట్టుకుంటుందని దర్శకుడు గురుమూర్తి తెలిపారు. మహిళా ప్రధాన కథాంశంతో రూపొందించిన ఈ చిత్రాన్ని నవంబర్ 1న విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు.