Chiranjeevi | అగ్ర నటుడు చిరంజీవి తాజా చిత్రం ‘విశ్వంభర’ షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం సీజీ వర్క్ జరుగుతున్నదని సమాచారం. తొలుత ఈ చిత్రాన్ని మే నెలలో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తాజా సమాచారం ప్రకారం జూన్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో చిరంజీవి తదుపరి సినిమాకు సిద్ధమవుతున్నారు. అనిల్ రావిపూడి దర్శకుడు. ఇటీవలే ‘సంక్రాంతికి వస్తున్నాం’తో బ్లాక్‌బస్టర్ హిట్‌ను కొట్టారు అనిల్ రావిపూడి. దాంతో చిరంజీవితో ఆయన చేయబోతున్న సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలేర్పడ్డాయి.
తాజా సమాచారం ప్రకారం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించబోతున్నారని తెలిసింది. కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారని, ఇందులో డ్యూయెట్స్ లాంటివి ఉండవని, ప్రేక్షకులకు చక్కటి వినోదాన్ని అందించడమే లక్ష్యంగా దర్శకుడు అనిల్ రావిపూడి స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారని అంటున్నారు. షైన్‌స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.