Mohan Lal | మలయాళీ సూపర్ స్టార్, నటుడు మోహన్‌లాల్ (Mohanlal) నటించిన తాజా చిత్రం ‘ఎల్ 2:ఎంపురాన్’(L2 Empuraan). పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం మార్చి 27న విడుదలై బాక్సాఫీస్ వద్ద పరుగులు పెట్టడమే కాకుండా ఈ సినిమా వర్గాన్ని కించపరిచేలా ఉందని విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. గుజరాత్ గోద్రా అల్లర్లకు(Gujarat Godhra Riots) సంబంధించి ఒక వర్గాన్ని అవమానకరంగా చిత్రీకరించే విధంగా ఈ చిత్రంలో సన్నివేశాలు ఉన్నాయని విమర్శలు వచ్చాయి. దీంతో ఈ వివాదంపై ఇప్పటికే సెన్సార్ బోర్డ్ 17 కట్స్ చెప్పగా.. తాజాగా మోహన్‌లాల్ కూడా క్షమాపణలు తెలిపాడు. అయితే ఈ మూవీపై నిర్మాత తాజాగా స్పందిస్తూ.. ఎంపురాన్ నుంచి 2 నిమిషాల కంటే ఎక్కువ సీన్లను కత్తిరించినట్లు ప్రకటించాడు.
చిత్ర నిర్మాత ఆంటోనీ పెరుంబావూర్ మాట్లాడుతూ.. ఎంపురాన్ నుంచి రెండు నిమిషాల కంటే ఎక్కువ సన్నివేశాలను తొలగించినట్లు తెలిపారు. సినిమా నుంచి సన్నివేశాలు తొలగించాలనే నిర్ణయం చిత్రబృందంలోని సభ్యులు అందరం కలిసి తీసుకుందని.. ఇది ప్రభుత్వం బయపెట్టడం వలనో లేక ఇంకేదైన కారణంతోనో కాదని వెల్లడించాడు. మూవీపై వచ్చిన వివాదం విషయంలో భయపడటం అనే ప్రశ్నే లేదు. మనం సమాజంలో జీవిస్తున్నాం. ఎవరి భావాలనూ గాయపరిచే ఉద్దేశం మాకు ఎన్నడూ లేదు. ఒకవేళ ఎవరైనా సినిమా వల్ల అసంతృప్తిగా ఉంటే, నిర్మాతలు, దర్శకులు, నటులుగా మేమంతా ఆ ఫిర్యాదును పరిష్కరించే బాధ్యత వహిస్తాం. అందుకే మేమంతా కలిసి సినిమా నుంచి సన్నివేశాలను తొలగించాం. భవిష్యత్తులో కూడా తాము నిర్మించిన సినిమా వల్ల ఎవరైనా బాధపడితే అందులో నుంచి కూడా సన్నివేశాలు తొలగిస్తాం.. త్వరలోనే ఎంపురాన్ 3 కూడా ఉండబోతుందంటూ పెరుంబావూర్ చెప్పుకోచ్చాడు.