Cm Vijay | తమిళనాడు సీఎం విజయ్ జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టబోతున్నట్లు సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. 2029లో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో తమ నాయకుడే ప్రధాని అభ్యర్థిగా ఉండాలని టీవీకే, కాంగ్రెస్ పార్టీల నాయకులు ప్రకటనలు చేస్తుండటంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అయితే ప్రధాని అభ్యర్థిగా కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ పేరును బలంగా వినిపిస్తుండగా, టీవీకే ఎమ్మెల్యే కనిమొళి సంతోష్ మాత్రం రాహుల్ గాంధీయే స్వయంగా విజయ్ను ప్రధాని పీఠంపై కూర్చోబెడతారంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. దీంతో ఈ విషయం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
శాసనసభ సమావేశాలకు హాజరయ్యే ముందు మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే కనిమొళి సంతోష్, 2029లో విజయ్ దేశ ప్రధాని అవుతారని, తమిళనాడు నుంచే తదుపరి ప్రధాన మంత్రి వస్తారని ధీమా వ్యక్తం చేశారు. గతంలో విజయ్ ముఖ్యమంత్రి అవుతారంటూ తాను చేసిన జోస్యం నిజమైందని గుర్తుచేసిన ఆమె, రాహుల్ గాంధీయే స్వయంగా విజయ్ చేయి పట్టుకుని ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధానిని చేస్తారని పేర్కొన్నారు. అయితే, ఒకవేళ విజయ్ ప్రధాని అయితే తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎవరు బాధ్యతలు చేపడతారనే ప్రశ్నకు, ఆ సమయం వచ్చినప్పుడు చూద్దామని ఆమె సమాధానాన్ని దాటవేశారు.
మరోవైపు, కాంగ్రెస్ పార్టీ మాత్రం రాహుల్ గాంధీ వైపే మొగ్గు చూపుతోంది. కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ తారాహై కత్బర్ట్ మీడియాతో మాట్లాడుతూ, రాహుల్ గాంధీయే తమ నాయకుడని స్పష్టం చేశారు. టీవీకే కార్యకర్తల వ్యాఖ్యలను కేవలం అభిమాన ధోరణిగా అభివర్ణించిన ఆమె, విజయ్ అభిమానులు తమ నాయకుడే ప్రధాని కావాలని కోరుకోవడం సహజమని, దీనిపై ఎలాంటి ప్రత్యేక రాజకీయ ముడులు అంటగట్టాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు. దీనికి తోడు, టీవీకే శ్రేణులు మధురై తదితర ప్రాంతాల్లో విజయ్ ప్రధాని అంటూ వాల్ పోస్టర్లు వేయడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.