Mohan Babu | మీడియా ప్రతినిధులపై మోహన్‌బాబు దాడిని జర్నలిస్టులు తీవ్రంగా ఖండించారు. మోహన్‌బాబు మీడియా ప్రతినిధులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ జల్పల్లిలోని ఆయన నివాసం ముందు ఆందోళన చేపట్టారు. కాగా, జర్నలిస్టులపై దాడి దారుణమని టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ ఖండించారు. మోహన్‌బాబు రౌడీషీటర్లా ప్రవర్తించారని అన్నారు. మీడియా స్వేచ్ఛకు భంగం కలిగించడం సరికాదని సూచించారు. న్యాయం జరిగే వరకు పోరాడతామని స్పష్టం చేశారు.
మోహన్‌బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని టీయూడబ్ల్యూజే జనరల్సెక్రటరీ మారుతి సాగర్ డిమాండ్ చేశారు. ఆయనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జర్నలిస్టులపై దాడిని ఏపీ, తెలంగాణ వీడియో జర్నలిస్ట్స్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. మీడియాపై దాడి మోహన్‌బాబు అహంకారానికి నిదర్శనమని అన్నారు. మోహన్‌బాబు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మోహన్‌బాబుపై పోలీసులు కేసు నమోదు చేయాలని టీటీజేఎంఏసీహెచ్ఎస్ డిమాండ్ చేసింది.
Thappu ledhu aa matram padali media batch ki#mohanbabumanchu #MohanBabu pic.twitter.com/kWQYSJVKT8
— చంటిగాడు లోకల్😎 (@Harsha_offl2) December 10, 2024
హైదరాబాద్ జల్పల్లిలోని మోహన్‌బాబు ఇంటి వద్ద హైడ్రామా కొనసాగుతోంది. తనపై తన తండ్రి మోహన్‌బాబు దాడి చేయించారని ఏడీజీపీకి ఫిర్యాదు చేసిన అనంతరం జల్పల్లిలోని నివాసానికి తన భార్య భూమా మౌనికతో వచ్చిన మంచు మనోజ్‌ను భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. లోపలికి వెళ్లకుండా సెక్యూరిటీ గేట్లు వేసేశారు. తమ ఏడు నెలల పాప లోపలే ఉందని.. గేట్లు తీయాలని వారితో మంచు మనోజ్ వాగ్వాదానికి దిగాడు. అయినప్పటికీ సెక్యూరిటీ గేటు ఓపెన్ చేయకపోవడంతో ఆగ్రహానికి గురైన మనోజ్.. ప్రైవేటు బౌన్సర్ల సాయంతో గేట్లు తోసుకుంటూ ఇంట్లోకి వెళ్లారు. అనంతరం కాసేపటికే చిరిగిన చొక్కాతో, దెబ్బలతో మనోజ్ బయటకు వచ్చాడు. ఈ క్రమంలో దాన్ని కవర్ చేసేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధులపై మోహన్‌బాబు ఆవేశంతో రెచ్చిపోయాడు. జర్నలిస్టుల చేతిలో ఉన్న మైకులు లాక్కొని వారిపైనే దాడికి దిగాడు. ఈ క్రమంలోనే మీడియా ప్రతినిధుల ఫోన్లను బౌన్సర్లు లాక్కున్నారు. కాగా, మీడియా ప్రతినిధులపై దాడిని జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండించాయి.