మణికందన్, శ్రీగౌరిప్రియ, కన్న రవి ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం ‘ట్రూ లవర్’. ప్రభురామ్ వ్యాస్ దర్శకుడు. ఈ చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్, మారుతి టీమ్ ప్రొడక్షన్స్ సంస్థలు తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నాయి. దర్శకుడు మారుతి, నిర్మాత ఎస్కేఎన్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.
ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకురానుంది. సోమవారం టీజర్‌ను రిలీజ్ చేశారు. దర్శకుడు ప్రభురామ్ చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘నా నిజజీవితంలో చూసిన సంఘటనల స్ఫూర్తితో ఈ కథ రాసుకున్నా. నేటితరం యువతీయువకుల ప్రేమబంధాలు, వాటిలో తలెత్తె సంఘర్షణ నేపథ్యంలో భావోద్వేగభరితంగా సాగుతుంది’ అన్నారు.
ప్రేమజంట తమ ప్రయాణంలో ఎదుర్కొన ఒడిదుడుకులను ఈ సినిమాలో హృద్యంగా చూపించారని నిర్మాత ఎస్కేఎన్ తెలిపారు. మనం చూసిన జీవితంలా అనిపిస్తూ సహజమైన ఉద్వేగాలతో ఈ సినిమా ఆకట్టుకుంటుందని దర్శకుడు మారుతి చెప్పారు. ఆధునిక యువత ప్రేమ సంఘర్షణకు అందమైన దృశ్యరూపంలా ఈ సినిమా ఉంటుందని కథానాయిక నాయకానాయికలు పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: శ్రేయాస్ కృష్ణ, సంగీతం: సీన్ రోల్డన్, రచన-దర్శకత్వం: ప్రభురామ్ వ్యాస్.