జానపద బ్రహ్మ బి.విఠలాచార్య దర్శకత్వం వహించిన సినిమా విశేషాలను నేటి తరం ప్రేక్షకులకు సమగ్రంగా పరిచయం చేస్తూ సీనియర్ సినీ జర్నలిస్ట్ పులగం చిన్నారాయణ ‘జై విఠలాచార్య’ పుస్తకాన్ని రచించారు. మూవీ వాల్యూమ్ మీడియా ఆధ్వర్యంలో షేక్ జీలాన్ బాషా ఈ పుస్తకాన్ని ప్రచురించారు. ఆదివారం ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ చేతుల మీదుగా ఈ పుస్తకావిష్కరణ జరిగింది. తొలి ప్రతిని రైల్వే ఉన్నతాధికారి రవి పాడి అందుకున్నారు.
ఈ సందర్భంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ ‘చరిత్రను రికార్డ్ చేయడం తెలుగులో చాలా తక్కువ. ముఖ్యంగా తెలుగు సినిమా చరిత్ర తక్కువగా అందుబాటులో ఉంది. జానపదబ్రహ్మగా అభివర్ణించే విఠలాచార్య జీవిత ప్రస్థానాన్ని నేటితరానికి తెలియజేసే ఈ ప్రయత్నం అభినందనీయం’ అన్నారు. ‘ఈ పుస్తకం కోసం పలువురు సినీ ప్రముఖులను ఇంటర్వ్యూలు చేయడంతో పాటు విఠలాచార్య కుటుంబ సభ్యులతో మాట్లాడి ఎన్నో విషయాలను సేకరించా. ఇప్పటివరకు ఎక్కడా అందుబాటులో లేని విస్త్రత సమాచారాన్ని ఈ పుస్తకలో పొందుపరిచాను’ అని రచయిత పులగం చిన్నారాయణ తెలిపారు.