Trisha | కొన్నేళ్లక్రితం త్రిష నటించిన హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు వరుసగా పరాజయం కావడంతో ఇక ఆమె కెరీర్ ముగిసినట్లేనని అందరూ భావించారు. అయితే ‘పొన్నియన్ సెల్వన్’ సిరీస్ చిత్రాలతో ఆమె అనూహ్యంగా విజయాల బాట పట్టింది. ప్రస్తుతం త్రిష చేతిలో అరడజనుకుపైగా చిత్రాలున్నాయి. తాజాగా ఈ భామ చేసిన ఓ ట్వీట్ నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేసింది. వివరాల్లోకి వెళితే…వెంకటేష్, త్రిష జంటగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో రూపొందిన ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ చిత్రం తెలుగులో మంచి విజయాన్ని సాధించింది.
ఈ సినిమా తనకు గొప్ప జ్ఞాపకాలను మిగిల్చిందని.. అవకాశమొస్తే వెంకటేష్, త్రిషతో సీక్వెల్ చేయాలనుకుంటున్నానని దర్శకుడు సెల్వరాఘవన్ 2013లో ఓ ట్వీట్ చేశారు. దానికి త్రిష ఇప్పుడు బదులిచ్చింది. ‘నేను రెడీ’ అంటూ ట్విట్టర్లో పేర్కొంది. దశాబ్దం క్రితం చేసిన ట్వీట్‌కు త్రిష స్పందన చూసి ఆశ్చర్యపోవడం నెటిజన్ల వంతైంది. త్రిష నాయికగా నటించిన ‘రోడ్’ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది.