Prabhas-Trisha | చిత్రసీమలో కొన్ని కాంబినేషన్స్ ఎప్పుడూ కొత్తగానే అనిపిస్తాయి. అలాంటి వాటిలో ప్రభాస్-త్రిష జోడీ ఒకటి. వెండితెరపై హిట్‌పెయిర్‌గా గుర్తుంపుతెచ్చుకుందీ జంట. వారిద్దరు కలిసి నటించిన ‘వర్షం’ ‘బుజ్జిగాడు’ ‘పౌర్ణమి’ చిత్రాలు అభిమానులను ఎంతగానో అలరించాయి. ముఖ్యంగా ‘వర్షం’ సినిమాలో ప్రభాస్, త్రిష మధ్య పండిన కెమిస్ట్రీని ఎప్పటికీ మరచిపోలేం.
తాజా సమాచారం ప్రకారం ఈ హిట్ పెయిర్ మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ ‘స్పిరిట్’ చిత్రంలో నటించబోతున్న విషయం తెలిసిందే. ఇందులో ప్రభాస్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో త్రిషను కథానాయికగా ఖరారు చేయబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే ఈ విషయంలో ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయని, త్వరలో అధికారిక ప్రకటన వెలువడుతుందని అంటున్నారు. ఈ ఏడాది చివరలో ‘స్పిరిట్’ సెట్స్‌మీదకు వెళ్లనుందని సమాచారం. ఇదిలావుండగా ఇటీవలే త్రిష ‘బృంద’ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇందులో ఆమె అభినయానికి ప్రశంసలు లభిస్తున్నాయి.