ఈ ఏడాది ‘పొన్నియన్ సెల్వన్’ చిత్రంతో భారీ విజయాన్ని దక్కించుకొని తిరిగి ఫామ్‌లోకి వచ్చింది త్రిష. ఒకప్పుడు దక్షిణాది అగ్ర కథానాయికగా ఓ వెలుగువెలిగిన ఈ భామ ప్రస్తుతం సినిమాల ఎంపికలో సెలెక్టివ్‌గా వ్యవహరిస్తున్నది. ఈ నేపథ్యంలో ఆమె రాజకీయాల్లోకి రానుందని చెన్నై సినీ వర్గాల్లో ప్రచారం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు త్రిష రంగం సిద్ధం చేసుకుంటున్నదని, త్వరలోనే ముహూర్తం నిర్ణయించుకుందని వార్తలొచ్చాయి. వీటిపై త్రిష స్పందించింది. తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టం చేసింది. భవిష్యత్తులో కూడా రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశ్యం లేదని తేల్చిచెప్పింది. ఈ ఏడాది కెరీర్ చాలా సంతృప్తికరంగా ఉందని, ఇకముందు కూడా సినిమాలపైనే దృష్టి పెడతానని తెలిపింది. ‘పొన్నియన్ సెల్వన్’ భారీ విజయం తర్వాత పలువురు అగ్ర నిర్మాతలు తమ సినిమాల కోసం త్రిషను సంప్రదించగా తిరస్కరించిందని..దాంతో ఆమె రాజకీయాల్లోకి రానుందనే వార్తలు పుట్టుకొచ్చాయని అంటున్నారు.