త్రిష కెరీర్ మొదలుపెట్టినప్పుడు పుట్టిన అమ్మాయిలు ఇప్పుడు హీరోయిన్లు. కానీ త్రిష ఇప్పటికీ హీరోయినే. అంతేకాదు, స్టార్ హీరోలతో జతకడుతూ కొత్తమ్మాయిలకు సవాలు విసురుతున్నది ఈ చెన్నయ్ చందమామ. ‘విశ్వంభర’ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో జతకట్టిన త్రిష, తాజాగా మరో గోల్డెన్‌ఛాన్స్ కొట్టేసింది. తమిళ అగ్ర హీరో విజయ్ తాజా చిత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్'(గోట్) చిత్రంలో కథానాయికగా ఛాన్స్ కొట్టేసింది త్రిష.
ఇందులో విజయ్ త్రండీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. యంగ్ విజయ్‌కి జోడీగా మీనాక్షి చౌదరి నటిస్తున్నది. తండ్రి పాత్రకు జోడీగా ముందు అనుష్కను అనుకున్నారు. అయితే, ఆ పాత్రకు స్వీటీ ‘నో’ చెప్పడంతో చివరికి బంతి త్రిష గోల్‌కి వచ్చి చేరింది. తమిళనాట విజయ్, త్రిష సూపర్‌హిట్ కాంబినేషన్. వారిద్దరి కలయికలో వచ్చిన ఆది, గిల్లీ, తిరుపాచ్చి, కురువి చిత్రాలు బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. రీసెంట్గా ‘లియో’తో ఈ జంట హిట్ అందుకుంది. అందుకే కలిసొచ్చిన కాంబినేషన్ మిస్ చేసుకోకూడదనుకుందో ఏమో.. తండ్రి పాత్ర చేస్తున్న విజయ్‌తో జతకట్టడానికి ఓకే అనేసింది త్రిష. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. ఇదే గాక, కమల్‌హాసన్, మణిరత్నంల ‘థగ్‌లైఫ్’, అజిత్‌తో ‘విడాముయర్చి’ చిత్రాల్లో కూడా త్రిష నటిస్తున్న విషయం తెలిసిందే.