న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22 : దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి ఈ ఆర్థిక సంవత్సరం (2026-27) ద్వితీయార్ధం (అక్టోబర్-మార్చి)లో మందగించే అవకాశాలున్నాయని డీబీఎస్ బ్యాంక్ సీనియర్ ఆర్థికవేత్త, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాధికా రావు హెచ్చరించారు. పెరుగుతున్న ఇంధన ధరలు.. ద్రవ్యోల్బణం, ద్రవ్య లభ్యత కొరతకు దారితీయవచ్చని పేర్కొన్నారు. అయితే ప్రథమార్ధం (ఏప్రిల్-సెప్టెంబర్)లోని ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో దేశ జీడీపీ ఏకంగా 7.8 శాతానికి పెరిగిన నేపథ్యంలో డీబీఎస్ అంచనా ఇప్పుడు మిక్కిలి ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్నది.
అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితి ముడి చమురు దిగుమతులపైనే ఆధారపడ్డ భారత్ వంటి దేశాలను రిస్క్‌లో పడేస్తున్నది. ఇప్పటికే ద్రవ్యోల్బణం విజృంభిస్తున్న సంకేతాలున్నాయి. ఫలితంగా వచ్చే నెల ద్రవ్య పరపతి విధాన సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక వడ్డీరేట్లను పెంచే అవకాశాలూ కనిపిస్తున్నాయి. పైగా అమెరికా, జపాన్ తదితర దేశాల సెంట్రల్ బ్యాంకులు ఇటీవల వడ్డీరేట్లను పెంచిన సంగతి విదితమే. దీంతో భారత్‌లోనూ కఠిన ద్రవ్య విధానాన్ని అనుసరిస్తే.. జీడీపీ ప్రగతికి బ్రేకులు పడుతాయని చెప్తున్నారు. రాధికా రావు మాటల్లోనూ ఇదే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దేశ జీడీపీ వృద్ధిరేటు సగటు 7.3 శాతానికే పరిమితం కావచ్చని డీబీఎస్ అంచనా వేస్తున్నది. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు, ఈ-వే బిల్లులు, విద్యుత్తు డిమాండ్, డిజిటల్ పేమెంట్స్‌లో స్థితిస్థాపకత కనిపిస్తున్నా.. అధిక ఇంధన ధరలు, కఠిన ద్రవ్య విధానంతో జీడీపీ ప్రగతికి మందగమనం ముప్పు పొంచి ఉన్నదని రాధికా రావు అంటున్నారు. ముఖ్యంగా ద్రవ్యోల్బణంపైనే ఆందోళనంతా అని ఆమె అంటున్నారు. గత నెల ఆగస్టులో వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 4.8 శాతంగా నమోదైందని గుర్తుచేస్తున్నారు.
చక్కెర, పాలు, వంటనూనెలు, ఇతర ప్రొటీన్ సంపన్న ఆహార పదార్థాల ధరలు పెరిగాయని, అధిక ఇంధన ధరలతో రవాణా చార్జీల సెగ కూడా తగులుతున్నదని అన్నారు. ఇక ఎల్ నినో ప్రభావంతో ఈసారి వర్షాలు సాధారణం కంటే తక్కువగానే ఉన్నాయని, దీంతో పంట దిగుబడులు పెద్ద ఎత్తునే తగ్గిపోయే వీలున్నదని విశ్లేషించారు. ఈ నేపథ్యంలోనే ఈ అక్టోబర్-మార్చిలో ప్రధాన ద్రవ్యోల్బణం 5 శాతం ఎగువనే ఉండవచ్చని అంచనా వేశారు. ఇక ఇటీవల ఎఫ్సీఎన్ఆర్(బీ) డిపాజిట్లతో దేశంలోకి భారీగా విదేశీ నిల్వలు వచ్చాయని, డాలర్ రిజర్వులు 780 బిలియన్ డాలర్లపైనే ఉన్నాయన్న రాధికా రావు.. దీనివల్ల బ్యాంకుల్లో మిగులు నిధులున్నాయని, ఇవి బ్యాంకింగ్ వ్యవస్థనే ఇబ్బందులు పెట్టవచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.