ప్రజా పాలన, ఇందిరమ్మ పాలన అంటూ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో మూడుసార్లు ప్రభుత్వ ఉద్యోగులకు హామీలు ఇచ్చారు. కానీ వాటిని నేటివరకూ నెరవేర్చకపోయారంటే ఇక ఆ పదవికి విలువేమున్నది?
కాంగ్రెస్ మ్యానిఫెస్టోలోని హామీలు, ఉద్యోగులకు హక్కుగా, న్యాయంగా రావలసిన ప్రధాన సమస్యలను పరిష్కరించాలని రెండున్నరేండ్ల నుంచి పెన్షనర్ల జేఏసీ, బాధిత పెన్షనర్ సంఘాలు, ఉద్యోగులు అనేక పర్యాయాలు ఉద్యమాలు చేపట్టారు. పెన్షనర్ల జేఏసీ ఇప్పటికే మూడు పర్యాయాలు హైదరాబాద్‌లోని ఇందిరా పార్కులో మహాధర్నా చేపట్టింది. ఈ సందర్భంగా 207 సంఘాలతో ఉన్న టీజీఈజేఏసీ రాష్ట్ర నాయకత్వం కిందిస్థాయి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల ఒత్తిడి మేరకు అనివార్యంగా నిరుడు మే నెలలో, ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో ఉద్యమ కార్యాచరణను ప్రకటించింది. ఈ నేపథ్యంలో మే 2న సీఎం నాలుగు హామీచ్చారు. మూడు నెలలైనా ఆ హామీల అమలు అతీగతీ లేకపోవడంతో పెన్షనర్ల జేఏసీ గత నెల 7న వేలాదిమందితో మహాధర్నా చేపట్టింది. కింది స్థాయి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల ఒత్తిడి మేరకు, విధి లేని క్రమంలో ఆగస్టు, సెప్టెంబర్‌లో మూడు దశల పోరాట కార్యక్రమాన్ని తీసుకుని చివరగా ఈనెల 10వ తేదీన ఎల్బీ స్టేడియంలో మహాధర్నా ప్రకటించారు. మహాధర్నా విజయవంతం కోసం వివిధ జిల్లాల్లో ఉద్యోగులు, పెన్షనర్లతో సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసి లక్షలాదిమందిని కదిలించారు.
ఉద్యమ తీవ్రతను చూసి ఇంటెలిజెన్స్ రిపోర్టు ఆధారంగా మహాధర్నా జరుగకూడదని ముఖ్యమంత్రి నిశ్చయించుకుని, ఉధృతంగా ఉన్న ఉద్యమాన్ని నీరుగార్చడానికి ఈనెల 18న చర్చలు జరుపుతామంటూ పీఆర్సీ చైర్మన్‌కు పీఆర్సీ రిపోర్టు సబ్మిట్ చేయాలని లెటర్ రాశారు. ఆ తర్వాత మహాధర్నాను వాయిదా వేయించి, ఈనెల 17, 18 తేదీల్లో జరుగాల్సిన చర్చలను 21 తేదీకి వాయిదా వేశారు. అయితే, ఈ తాజా చర్చల్లో ముఖ్యమంత్రి పాల్గొనపోవడం ఉద్యోగులను మోసగించడమే అయ్యింది. మళ్లీ ఈనెల 22న చర్చలు జరుగుతాయంటూ ప్రకటించినా అందుకు సీఎం ముందుకు రాలేదు. చర్చలు మళ్లీ ఈనెల 23న జరుగుతాయని మళ్లీ వాయిదా వేశారు. కేవలం కాలయాపన కోసమే ఈ సర్కార్ నాటకాలు ఆడుతున్నదని ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల్లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఉద్యోగులు ఎలాంటి ఉచిత పథకాలు అడుగడం లేదు. గొంతెమ్మ కోరికలూ కోరడం లేదు. వారికి న్యాయంగా, హక్కుగా రావలసినవి మాత్రమే అమలు చేయాలని వేడుకుంటున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో ప్రధానమైన పీఆర్సీ ఆచరణకు నోచుకోవడం లేదు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు నెలల్లో పీఆర్సీ అమలు చేస్తామన్నారు. 2026 జూలై వరకు 6 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంతవరకు ఇన్ని డీఏలు పెండింగ్‌లో లేవు.
రాష్ట్రంలోని అన్ని కార్పొరేట్ దవాఖానల్లో ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు నగదు రహిత వైద్యం అమలు చేస్తామన్న హామీ అమలుకు నోచుకోలేదు. అయినా ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్ల నుంచి 1.5 శాతం నాలుగు నెలలుగా కాంట్రిబ్యూషన్ వసూలు చేస్తున్నారు. అయినప్పటికీ కార్పొరేట్ ఆసుపత్రుల్లో నగదు రహిత వైద్యం సరిగా అందించడం లేదు. అంటే ఉద్యోగుల ఆరోగ్యం పట్ల ప్రభుత్వానికి ఏమాత్రం శ్రద్ధ, చిత్తశుద్ధి లేవని అనుకోవాల్సి వస్తున్నది. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ పాలన, ప్రజాపాలన అని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు ఆవేదనతో ఆక్రోశాన్ని వెళ్లగక్కుతున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) రద్దుపరచి పాత పెన్షన్ విధానాన్ని అమలుపరుస్తామన్న హామీ ఏమైంది? కొన్ని రాష్ర్టాల్లో ఈ విధానం ఎంతోకాలం నుంచి అమలవుతున్నది. కానీ మన రాష్ట్రంలో ఎందుకు అమలు చేయడం లేదు? 2024 మార్చి నుంచి ఇప్పటివరకు రిటైరైన ఉద్యోగులకు పూర్తిస్థాయిలో బకాయిలు చెల్లించలేదు. ఉద్యోగుల పెండింగ్ బిల్లులు అన్నింటినీ చెల్లించలేదు. ఈ నేపథ్యంలో వీటన్నింటి అమలుకు ప్రతినెలా రూ. 2 వేల కోట్లు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం.
కాంగ్రెస్ ఉద్యోగ జేఏసీ నాయకులు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా, స్వార్థరహితంగా, నిస్వార్థంగా, సమర్థవంతమైన ఉద్యోగ సంఘ నాయకులుగా ఉద్యోగుల శ్రేయస్సు, సంక్షేమం, న్యాయమైన డిమాండ్ల సాధన కోసం పోరాడుతారని, రాష్ట్రంలోని దాదాపు 13 లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వంతో చర్చలు విఫలమైనట్టయితే, తక్షణమే ఉద్యోగ జేఏసీ నాయకులు సమ్మె నోటీసు ఇచ్చి, ఉద్యోగులు పెన్‌డౌన్, ఉపాధ్యాయులు పాఠశాలలకు సామూహిక సెలవులు పెట్టి ఉద్యమ కార్యాచరణ ప్రకటించాలి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సకల జనుల సమ్మెలో ఏ విధంగానైతే పాల్గొన్నామో, ఆ విధంగానే హక్కుల సాధన కోసం ఉద్యమించేలా కృషి చేయాలి.
– (వ్యాసకర్త: రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం ప్రతినిధి)
కందుకూరి దేవదాసు 9949937745