దర్శకుడు వి.ఎన్.ఆదిత్య చిత్రీకరించిన మ్యూజికల్ వీడియో ‘స్వప్నాల వాన’. శ్రీ క్రియేటివ్ మ్యూజిక్ అండ్ ఎంటైర్టెన్మెంట్స్ పతాకంపై అమెరికా డల్లాస్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ గోపీకృష్ణ కొటారు ఈ మ్యూజిక్ వీడియోను నిర్మించారు. ఆయన కుమార్తె శ్రీజ కొటారు స్వయంగా పాడి, నటించిన ఈ మ్యూజిక్ వీడియోను దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రికి అంకితమిచ్చారు. యశ్వంత్ ఈ వీడియోలోని పాటను రాయగా, పార్థసారథి నేమాని స్వరపరిచారు. ఈ వీడియో లాంచ్ కార్యక్రమం ఇటీవలే జరిగింది. పూర్తిగా అమెరికాలోని డల్లాస్ నగరంలోనే చిత్రీకరణ జరిగిందని, పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలో విడుదల చేస్తామని మేకర్స్ తెలిపారు. సిరివెన్నెల స్ఫూర్తితో పిల్లల కోసం ఈ పాటని రూపొందించామని పార్థసారధి నేమాని తెలిపారు. శ్రీజ ప్రొఫెషనల్ సింగర్‌లా పాడిందని, సందేశాత్మకంగా సాగే ఈ పాట అందరికీ నచ్చుతుందని, వీలైనంత త్వరలో విడుదల చేస్తామని వీఎన్ ఆదిత్య తెలిపారు.