Toxic | కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్’ గురించి మరోసారి ఆసక్తికర వార్తలు సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. కేజీఎఫ్ సిరీస్‌తో దేశవ్యాప్తంగా సంచలన క్రేజ్ సంపాదించుకున్న యష్ నుంచి వస్తున్న తదుపరి సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే సినిమా విడుదల తేదీ విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రాకపోవడంతో అభిమానుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రతిభావంతురాలైన దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో యష్ సరసన రుక్మిణి వసంత్, తారా సుతారియా నటిస్తుండగా, కీలక పాత్రల్లో హుమా ఖురేషి, కియారా అద్వానీ, నయనతార కనిపించనున్నారని సమాచారం. భారీ తారాగణం, హై బడ్జెట్ నిర్మాణ విలువలతో రూపొందుతున్న ఈ సినిమా మొదటి నుంచే దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
అయితే ఈ చిత్రం ఇప్పటికే విడుదల కావాల్సి ఉన్నప్పటికీ, మేకర్స్ సరైన సమయాన్ని ఎంపిక చేసుకునే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. మార్కెట్ పరిస్థితులు, ఇతర పెద్ద సినిమాల విడుదలలు, పాన్ ఇండియా స్థాయిలో బిజినెస్ అవకాశాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని విడుదలను వాయిదా వేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా వినిపిస్తున్న బలమైన బజ్ ప్రకారం ‘టాక్సిక్’ సినిమా ఈ ఏడాది అక్టోబర్ నెలకు షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయట. ముఖ్యంగా అక్టోబర్ తొలి వారం లేదా మూడో వారంలో విడుదల చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నట్లు కన్నడ సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, అభిమానులు అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు.
ఇప్పటి వరకు చిత్ర బృందం నుంచి రిలీజ్ డేట్‌పై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది. అయితే పండుగల సీజన్‌ను టార్గెట్ చేస్తూ అక్టోబర్‌లో విడుదల చేస్తే సినిమాకు మరింత భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇక ఈ భారీ చిత్రానికి సంగీత సంచలనం రవి బస్రూర్ స్వరాలు అందిస్తున్నారు. కేజీఎఫ్ సినిమాలతో తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఆయన, టాక్సిక్‌కు కూడా ప్రత్యేకమైన సంగీతాన్ని అందిస్తున్నట్లు తెలుస్తోంది. యష్‌తో పాటు కేవీఎన్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా యాక్షన్, ఎమోషన్, స్టైలిష్ విజువల్స్ కలగలిసిన విభిన్న అనుభూతిని అందించనుందని సమాచారం.