‘ ARM మొదలుపెట్టినప్పుడు నటుడిగా ఇది నా 50వ సినిమా అవుతుందని తెలీదు. ఇది చాలా ఎక్సయిటింగ్ స్క్రిప్ట్. ఇందులో మూడు డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశాను. దీనికోసం వర్క్ షాప్ కూడా చేశాం. నిజంగా ఛాలెంజ్‌గా తీసుకొని చేసిన సినిమా ఇది’ అని మలయాళ అగ్రహీరో టోవినో థామస్ అన్నారు. ఆయన నటించిన పాన్ ఇండియా ఫాంటసీ ప్రాజెక్ట్ ARM.
కృతిశెట్టి, ఐశ్వర్య రాజేశ్, సురభి లక్ష్మీ కథానాయికలు. డెబ్యుటెంట్ జితిన్‌లాల్ దర్శకుడు. డాక్టర్ జకారియా థామస్, లిస్టిన్ స్టీఫెన్ నిర్మాతలు. ఈ చిత్రాన్ని తెలుగులో మైత్రీ మూవీమేకర్స్ వారు విడుదల చేస్తున్నారు. ఈ నెల 12న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో టోవినో థామస్ ఆదివారం హైదరాబాద్‌లో విలేకరులతో ముచ్చటించారు.
‘ఇందులో నేను చేసిన మూడు పాత్రల్లో దొంగగా కనిపించే మణి పాత్రను కొంచెం ఎక్కువ ఇష్టపడ్డాను. చాలా పాషనేటింగ్ క్యారెక్టర్ అది. కాన్ఫిడెన్స్ గల దొంగ అనమాట. దర్శకుడు జితిన్‌లాల్ స్క్రిప్ట్ నిజంగా అద్భుతం. అతని నాన్ లీనియర్ స్క్రీన్‌ప్లే ఈ సినిమాకి హైలైట్.’ అని తెలిపారు టోవినో థామస్.
కథానాయికలు కృతిశెట్టి, ఐశ్వర్యరాజేశ్, సురభిలక్ష్మీ అద్బుతంగా నటించారని, ఇమాజినరీ ఫిక్షనల్ వరల్డ్‌ని ఆవిష్కరించేలా సినిమా ఉంటుందని, ఆడియన్స్‌ని కథలో లీనం చేసేందుకే త్రీడీలో చేశామని, ఇంగ్లిష్, స్పానిష్ భాషల్లో కూడా సినిమాను విడుదల చేస్తున్నామని ఆయన చెప్పారు. సాంకేతికంగా నెక్ట్స్ లెవల్లో ఉండే ఈ సినిమాలో తెలుగు ప్రేక్షకులకు నచ్చే అంశాలన్నీ ఉంటాయని టోవినో థామస్ చెప్పారు.