Tourist Family | ఈ ఏడాది చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్టైన చిత్రాల్లో ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ ఒకటి. సింపుల్ స్టోరీ, నేచురల్ ప్రెజెంటేషన్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. కేవలం ₹5 కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ, దేశవ్యాప్తంగా దాదాపు ₹75 కోట్ల వసూళ్లు సాధించి రికార్డు సృష్టించింది. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా ఘన విజయం సాధించింది. ఈ చిత్రంతో దర్శకుడిగా అభిషన్ జీవింత్ సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. సినిమాకు దర్శకత్వం వహించడమే కాకుండా, తన నటనతోనూ ప్రేక్షకులను మెప్పించాడు. యూట్యూబర్‌గా కెరీర్ ప్రారంభించిన అభిషన్, తొలి సినిమాతోనే సంచలన విజయాన్ని అందుకున్నాడు.
ఇప్పుడు ఈ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాడు. ఈ నెల 31న తన ప్రేయసితో వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నాడు. ఈ నేపథ్యంలో అభిషన్‌కు అతని స్నేహితుడు, ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ నిర్మాత మాగేశ్ రాజ్ ఓ అద్భుతమైన సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు.వివాహ కానుకగా మాగేశ్ రాజ్ అభిషన్‌కు ఖరీదైన లగ్జరీ BMW కారు బహుమతిగా అందజేశారు. ఈ విషయాన్ని ప్రముఖ సినీ ట్రేడ్ అనలిస్ట్ రమేశ్ బాలా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వీటిని చూసిన సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు అభిషన్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అలానే నిర్మాతపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ చిత్రంలో సీనియర్ నటి సిమ్రాన్, శశి కుమార్, యోగి బాబు తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. కంటెంట్ బలంతో ముందుకెళ్లిన ఈ సినిమా, చిన్న బడ్జెట్‌తో రూపొంది పెద్ద విజయం సాధించింది .