బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో గత రెండేళ్లుగా ప్రేమాయణాన్ని సాగిస్తున్నది అగ్ర నాయిక రకుల్‌ప్రీత్‌సింగ్. తెలుగు చిత్రాలకు విరామమిచ్చిన ఈ పంజాబీ ముద్దుగుమ్మ ప్రస్తుతం బాలీవుడ్ పైనే దృష్టి పెట్టింది. అక్కడ వైవిధ్యమైన కథాంశాల్ని ఎంచుకుంటూ నటిగా సత్తా చాటే ప్రయత్నాలు చేస్తున్నది. ఇటీవల ఈ అమ్మడి పెళ్లి వార్తలు బాలీవుడ్ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. రకుల్‌ప్రీత్‌సింగ్ సోదరుడు అమన్‌ప్రీత్ ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సోదరి త్వరలో వివాహం చేసుకోబోతున్నదని చెప్పారు. జాకీ భగ్నానీతో ఆమె పెళ్లికి తమ కుటుంబం సమ్మతంగానే ఉందని తెలిపారు.
ఈ వార్తలపై రకుల్‌ప్రీత్‌సింగ్ స్పందించింది. ‘నా పెళ్లి గురించి తమ్ముడు అమన్ అలా మాట్లాడారా? నా పెళ్లి గురించి నాకు కూడా ముందస్తు సమాచారం ఇస్తే బాగుండేది కదా బ్రదర్…నా వివాహం గురించి నాకే తెలియకపోవడం చాలా ఫన్నీగా అనిపిస్తున్నది’ అని ఆమె ట్విట్టర్లో సరదాగా వ్యాఖ్యానించింది. ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాలకు కాస్త బ్రేక్ తీసుకున్నానని, త్వరలో ఓ మంచి సినిమాతో ప్రేక్షకుల్ని పలకరిస్తానని చెప్పింది. కథానాయికగా తన ఉన్నతికి తెలుగు ప్రజలే కారణమని, వారికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని రకుల్‌ప్రీత్‌సింగ్ పేర్కొంది. ప్రస్తుతం ఆమె బాలీవుడ్లో డాక్టర్ జీ, థాంక్గాడ్, ఛత్రివాలి వంటి వరుస చిత్రాలతో బిజీగా ఉంది.