‘ప్రేక్షకులతో కలిసి ఈ సినిమా చూడాలని ఉంది. ‘తుఫాన్’ లాంటి గొప్ప సినిమా నాకిచ్చిన దర్శకుడు విజయ్ మిల్టన్కు థ్యాంక్స్. తను అద్భుతమైన దర్శకుడేకాదు, గొప్ప సినిమాటోగ్రాఫర్ కూడా. ‘తుఫాన్’ విజువల్స్ చూస్తే అది అర్థమవుతుంది. ఈ సినిమా నేపథ్యం కొత్తగా ఉంటుంది. అందరూ ‘తుఫాన్’ని ఎంజాయ్ చేస్తారు.’ అని విజయ్ ఆంటోని నమ్మకం వ్యక్తం చేశారు.
ఆయన కథానాయకుడిగా రూపొందిన పొయెటిక్ యాక్షన్ ఎంటైర్టెనర్ ‘తుఫాన్’. మేఘా ఆకాష్ కథానాయిక. విజయ్ మిల్టన్ దర్శకుడు. కమల్ బోరా, డి.లలితా, బి.ప్రదీప్, పంకజ్ బోరా నిర్మాతలు. ఈ నెల 26న సినిమా విడుదల కానుంది. హైదరాబాద్లో నిర్వహించిన ఈవెంట్లో ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేశారు. ఈ సందర్బంగా విజయ్ ఆంటోనీ మాట్లాడారు. ‘ఓ మంచి సినిమా చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతలకు, మా హీరో విజయ్ ఆంటోనీకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ‘తుఫాన్’ అందరికీ నచ్చుతుంది’ అని దర్శకుడు చెప్పారు. తన కెరీర్లో ‘తుఫాన్’ ప్రత్యేకమైన సినిమా అని కథానాయిక మేఘా ఆకాష్ అన్నారు. ఇంకా నిర్మాతలతోపాటు చిత్ర యూనిట్ కూడా మాట్లాడారు. భాష్యశ్రీ సంభాషణలు అందించిన ఈ చిత్రానికి అచ్చు రాజమణితో కలిసి విజయ్ ఆంటోని స్వరాలందించారు.