Praneeth Hanumanthu | యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు గతంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, ముఖ్యంగా తండ్రి-కూతుళ్ల అనుబంధంపై చేసిన అనుచిత జోక్స్ పెద్ద దుమారాన్నే రేపిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో అతడు జైలుకి కూడా వెళ్లి వచ్చాడు. అయితే తాజాగా చాలా రోజుల తర్వాత యూట్యూబ్ వేదికగా ఒక వీడియో పెట్టిన ప్రణీత్ ఇందులో టాలీవుడ్ ఇండస్ట్రీపై సంచలన ఆరోపణలు చేస్తూ పరిశ్రమలోని ద్వంద్వ ప్రమాణాలను ఎండగట్టారు.
గతంలో తనపై వచ్చిన విమర్శలను ప్రస్తావిస్తూ, ఇండస్ట్రీలోని సెలబ్రిటీలు అనుసరిస్తున్న తీరును ఆయన వేలెత్తి చూపారు. ముఖ్యంగా సాయి ధరమ్ తేజ్ వంటి హీరోలు తన పాత వీడియోలపై స్పందించిన తీరును గుర్తు చేస్తూ, ఇండస్ట్రీలో అంతకంటే దారుణమైన విషయాలు జరుగుతున్నప్పుడు ఈ నీతులు చెప్పే పెద్దలు ఎందుకు మౌనంగా ఉంటున్నారని ఆయన ప్రశ్నించారు. కేవలం తనను మాత్రమే టార్గెట్ చేశారని, పరిశ్రమలోని ఇతర లోపాలపై సెలబ్రిటీలు సెలెక్టివ్ గా స్పందిస్తున్నారని ఆయన ఆరోపించారు. దీనితో పాటు హీరో కార్తికేయ వంటి వారు తమ సినిమాల ప్రమోషన్ల కోసం డబ్బులు చెల్లించి మరీ తనతో రోస్ట్ సెషన్లు చేయించుకున్నారని, వివాదం రాగానే తనకు సంబంధం లేదన్నట్లుగా ట్వీట్లు చేయడం వారి ద్వంద్వ నీతికి నిదర్శనమని ధ్వజమెత్తారు. అవసరానికి వాడుకుని ఇబ్బందులు రాగానే చేతులు కడిగేసుకునే ఈ వైఖరిని ఆయన తీవ్రంగా విమర్శించారు. బయటి వ్యక్తులపై గొంతు ఎత్తే టాలీవుడ్ ప్రముఖులు, పరిశ్రమలో ఉన్న క్యాస్టింగ్ కౌచ్ వంటి చీకటి కోణాలపై ఎందుకు మాట్లాడటం లేదని ఆయన నిలదీశారు. ప్రణీత్ హనుమంతు చేసిన ఈ ‘హైపోక్రసీ ఎక్స్పోజ్’ వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో మరియు సోషల్ మీడియాలో పెను దుమారం రేపుతున్నాయి. సాయి ధరమ్ తేజ్ నుంచి కార్తికేయనే కాకుండా హైపర్ ఆది, మంచు విష్ణు తదితరులను ఈ వీడియోలో ప్రశ్నించాడు ప్రణీత్.