New Tollywood Directors | తెలుగు సినిమా గమనాన్ని గమనిస్తే.. ప్రతి మలుపులోనూ ఓ కొత్త దర్శకుడు కనిపిస్తాడు. ట్రెండ్ సెట్ చేసిన సినిమాలన్నీ దాదాపుగా కొత్త దర్శకులవే. న్యూ బ్లడ్.. న్యూ థింకింగ్.. న్యూ మేకింగ్.. వీటితో ఎప్పటికప్పుడు సినిమా మేకోవర్ అవుతూ ఉంటుంది. ఈ ఏడాది విశేషమేంటంటే.. ఎప్పటిలాగే సక్సెస్ పర్సంటేజ్ తక్కువ.. వాటిలో కొత్త దర్శకులు సాధించిన విజయాలు ఎక్కువ. సినిమాలైతే రెండొందలకు పైనే విడుదలయ్యాయి. విజయాలు మాత్రం పాతికలోపే. వాటిలో ఎనిమిది సినిమాలు కొత్త దర్శకులవే కావడం విశేషం. అవి కూడా ఒకదానిదో ఒకటి సంబంధం లేని భిన్నమైన కాన్సెప్టులు కావడం మరో విశేషం. అవేంటో ఓ లుక్కేద్దాం.
ఈ ఏడాది సక్సెస్ అందుకున్న తొలి డెబ్యూ డైరెక్టర్ విజయ్ బిన్నీ. సినిమా ‘నా సామిరంగ’. నాగార్జున లాంటి టాప్ స్టార్‌ని తొలి ప్రయత్నంలోనే డైరెక్ట్ చేయడమంటే సామాన్యమైన విషయం కాదు. నాగ్‌తోపాటు అల్లరి నరేశ్, రాజ్‌తరుణ్ కూడా ఇందులో నటించారు. ముగ్గురు హీరోలతో అసలుసిసలైన సంక్రాంతి సినిమా తీసి మంచి విజయాన్ని అందుకున్నాడు విజయ్ బిన్నీ. అన్ని రకాల ఎమోషన్సూ ఉన్న మాస్ ఎంటైర్టెనర్ ఇది. అందుకే ఓ వైపు సంక్రాంతి బరిలో విడుదలై.. ‘హను-మాన్’ అదరగొట్టేస్తున్నా.. ‘నా సామిరంగ’ మాత్రం తెలుగు స్టేట్స్లో డీసెంట్ హిట్‌గా నిలిచింది. చిట్టూరి శ్రీనివాస్ ఈ సినిమాకు నిర్మాత.
ఫిబ్రవరిలో విడుదలైన ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’ సినిమా ద్వారా దుష్యంత్ కటికనేని దర్శకుడిగా పరిచయం అయ్యాడు. సుహాస్ కథానాయకుడిగా రూపొందిన ఈ చిత్రం అసమానతల నేపథ్యంతో కూడిన రూరల్ ప్రేమకథ. ఓ వైపు అందమైన ప్రేమకథను చూపిస్తూ.. మరోవైపు సామాజిక అంశాలను కూడా చర్చించాడు దర్శకుడు దుష్యంత్. హీరో సుహాస్కీ, కథానాయికగా పరిచయమైన శివానీకీ, కీలక పాత్ర పోషించిన శరణ్య ప్రదీప్కీ ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది. విమర్శకుల ప్రశంసలతో పాటు వాణిజ్యపరంగా కూడా సినిమా బాగా ఆడింది. ధీరజ్ మొగిలినేని, వెంకట్‌రెడ్డి కలిసి ఈ సినిమాను నిర్మించారు.
మార్చిలో విడుదలైన విశ్వక్సేన్ అడ్వెంచర్ థ్రిల్లర్ ‘గామి’ ఓ మంచి ప్రయోగం. ఈ సినిమా ద్వారా విధ్యాధర్ కాగిత దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఓ అఘోరా సాహస యాత్రే ఈ సినిమా. దర్శకుడిగా తొలి అడుగు ఈ తరహా కథతో వేయడం నిజంగా సాహసమే. అసలు హీరో విశ్వక్సేన్ను ఇలాంటి పాత్రలో ఎవరూ ఊహించరు. కీలక పాత్ర పోషించిన ఛాందినీ చౌదరికి కూడా ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది. కథ, మేకింగ్ పరంగా ఈ సినిమా పలువురి ప్రశంసలందుకుంది. దర్శకుడిగా విధ్యాధర్కి కూడా మంచి మార్కులే పడ్డాయి. కార్తీక్ శబరీష్ ఈ చిత్రానికి నిర్మాత.
జూన్‌లో విడుదలైన ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ ఓ వినూత్నమైన స్నేహం కథ. శివ పాలడుగు దర్శకుడిగా పరిచయం అయ్యాడు. కుటుంబం కోసం ఆత్మవంచన చేసుకొని బతుకున్న ఓ పెద్దాయనకీ, సరిగ్గా అలాంటి పరిస్థితుల్లోకే నెట్టివేయబడుతున్న ఓ అమ్మాయికీ మధ్య జరిగిన కథే ఇది. ఇందులో పెద్ద స్టార్లు లేకపోవడంతో థియేటర్లలో సినిమా సరిగ్గా ఆడలేదు. కానీ ఓటీటీలో మాత్రం జనం బాగా చూశారు. దర్శకుడిగా శివ పాలడుగుకీ, ప్రధాన పాత్రలు పోషించిన అజయ్ ఘోష్, ఛాందినీ చౌదరిలకు ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది. హర్ష గారపాటి, రంగారావు గారపాటి సినిమాకు నిర్మాతలు.
ఆగస్ట్ నెలలో రెండు సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో ఒకటి ‘కమిటీ కుర్రోళ్లు’ కాగా, రెండో సినిమా ‘ఆయ్’. రెండూ గోదావరి జిల్లాల నేపథ్యంతో కూడిన కథలే కావడం విశేషం. ఈ రెండు సినిమాల ద్వారా ఇద్దరు కొత్త దర్శకులు వెండితెరకు పరిచయం అయ్యారు. వారిలో ఒకరు యదు వంశీ. ఇతని దర్శకత్వంలో వచ్చిన ‘కమిటీ కుర్రోళ్లు’ ఓ అద్భుతమైన జ్ఞాపకం లాంటి సినిమా. కోనసీమ అందాలు, అక్కడి సంప్రదాయాలు, నమ్మకాలు, ప్రేమలు, స్నేహాలు.. ఈ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. వాణిజ్యపరంగా పెద్ద విజయాన్నే అందుకుందీ సినిమా. అంతేకాదు, చాలామంది కొత్త నటీనటులు ఈ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. కొణిదెల నిహారిక ఈ సినిమాకు సమర్పకురాలు కావడం విశేషం. పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక కలిసి ఈ సినిమాను నిర్మించారు.
ఇక ‘ఆయ్’ విషయానికొస్తే.. ఈ సినిమా ద్వారా అంజి కె.మణిపుత్ర దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఇది ఓ విభిన్నమైన ప్రేమకథ. ప్రేమకు కులం అడ్డంకిగా మారితే పరిస్థితేంటి? అనేదే ఈ సినిమా కథ. కోనసీమ అందాలు, అక్కడి మనస్తత్వాలు, పంతాలు, పట్టింపులు నేపథ్యంలో ఆసక్తిగా, అంతకు మించి కామెడీగా ఈ సినిమా సాగింది. ఇది కూడా కమర్షియల్‌గా మంచి హిట్టే. ఇందులో హీరోహీరోయిన్లుగా చేసిన నార్నె నితిన్, నయన్ సారిక కెరీర్లకు ఈ సినిమా మంచి బ్రేక్. బన్నీవాసు, విద్య కొప్పినీడి ఈ చిత్రానికి నిర్మాతలు.
ఈ ఏడాది సెప్టెంబర్‌లో వచ్చిన మంచి సినిమా ‘35 చిన్న కథకాదు’. పేరు తగ్గట్టే ఇది చిన్న కథ కాదు.. గొప్ప కథ. అమీర్‌ఖాన్ ‘తారే జమీన్పర్’ సినిమాతో పోల్చదగ్గ కథ ఇది. విద్యావ్యవస్థలోని లోపాల్ని ఎత్తి చూపుతూ.. పిల్లల అభ్యున్నతిలో తల్లిదండ్రుల పాత్రను తెలియజెప్పే గొప్ప కథతో దర్శకుడు నందకిశోర్ ఈమని ఈ సినిమాను తెరకెక్కించాడు. తొలి ప్రయత్నంగా గొప్ప కథ రాసుకొని, అంతేగొప్పగా తెరకెక్కించి పలువురి ప్రశంసలందుకున్నారు నందకిశోర్. తిరుపతిలోని ఓ సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జరిగే కథ ఇది. రెండున్నర గంటలపాటు ప్రేక్షకుల్ని కూడా తిరుపతిలో కూర్చోబెట్టాడు దర్శకుడు నందకిశోర్. నివేత థామస్ అభినయం ఈ సినిమాకు ప్రధానబలం. అలాగే ప్రియదర్శి, అరుణ్‌దేవ్ పోతుల కూడా చక్కగా అభినయించారు. వాణిజ్యపరంగా కూడా ఈ సినిమా బాగా ఆడింది. శృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మాతలు.
ఇక ఈ ఏడాదిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన సినిమా “క”. కొత్తగా ఆలోచిస్తే, ఆ ఆలోచనను అద్భుతంగా తెరకెక్కిస్తే.. అది చిన్న సినిమా అయినా.. పెద్ద విజయం ఖాయమని నిరూపించిన సినిమా ఇది. ఈ సినిమా ద్వారా సుజీత్-సందీప్ దర్శకులుగా పరిచయం అయ్యారు. ఇద్దరు కలిసి ఓ చిత్రాన్ని డైరెక్ట్ చేయడం తెలుగు తెరపై ఇదే ప్రథమం. కర్మసిద్ధాంతం చుట్టూ తిరిగే కథ ఇది. కథను చివరి దాకా నడిపించిన తీరు అద్భుతమైతే.. చివరికి ఈ దర్శకులిద్దరూ ఇచ్చిన ట్విస్ట్ మహాద్భుతం. పిరియాడిక్ కథాంశం కావడంతో ఓ కొత్త వాతావరణాన్ని తెరపై చూపించడంలో దర్శకులిద్దరూ సక్సెస్ అయ్యారు. అలాగే.. ఇందులో హీరోగా చేసిన కిరణ్ అబ్బవరం నటుడిగా ఓ మెట్టు పెకెక్కాడు. అలాగే కథానాయికలు నయన్ సారిక, తన్వీరామ్లకు కూడా ఈ సినిమా మంచి బ్రేక్. ఈ ఏడాది వచ్చిన బెస్ట్ మూవీస్‌లో ‘క’ ఒకటి అని నిక్కచ్చిగా చెప్పొచ్చు. చింతా గోపాలకృష్ణారెడ్డి ఈ చిత్రానికి నిర్మాత.
చివరిగా చెప్పొచ్చేదేంటంటే.. ఎంతమంది దర్శకులు పరిచయం అయ్యారు అనేది ముఖ్యంకాదు. ఎంతమంది సక్సెస్ సాధించారు అనేది ఇక్కడ ముఖ్యం. ఆ విధంగా చూసుకుంటే ఈ ఏడాది వచ్చిన విజయాలలో సగం కొత్తవారివే. ఏదేమైనా.. ద్వితీయ విఘ్నాన్ని అధిగమించడమే ఇక్కడ అసలైన పరీక్ష. పరిశ్రమలో గట్టి పునాది రెండో విజయంతోనే పడేది. మరి తొలి ప్రయత్నంలో విజయాలను అందుకున్న వీరిలో ద్వితీయవిఘ్నాన్ని అధిగమించేది ఎందరో చూడాలి.