హైదరాబాద్: తెలుగు సినిమా చిత్రీకరణలు నిలిచిపోనున్నాయి. నేటి నుంచి అన్ని చిత్రాల షూటింగ్స్ ఆపేస్తున్నట్లు ఫిలింఛాంబర్ ప్రకటించింది. టాలీవుడ్ సమస్యలు పరిష్కరించుకునే వరకు చిత్రీకరణలు చేయకూడదనే అగ్ర నిర్మాతల (ప్రొడ్యూసర్స్ గిల్డ్) నిర్ణయానికి ఫిలింఛాంబర్ పూర్తి మద్దతు ప్రకటించింది. ప్రస్తుతం షూటింగ్లో ఉన్న సినిమాలు, తుది దశలో ఉన్న చిత్రాల్ని కూడా ఆపేయనున్నారు. ఆదివారం ఫిలిం ఛాంబర్ జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో నూతన అధ్యక్షుడిగా నిర్మాత కె. బసిరెడ్డిని ఎన్నుకున్నారు.
అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో అగ్ర నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ…‘ఇవాళ్టి నుంచి అన్ని సినిమాల షూటింగ్స్ ఆపేస్తున్నాం. చిన్న నిర్మాతలు కూడా మా నిర్ణయానికి సహకరించారు. ఫిలింఛాంబర్ మద్దతుగా నిలిచింది. వాళ్లందరికీ కృతజ్ఞతలు చెబుతున్నాం. కరోనా తర్వాత పెరిగిన ఓటీటీ ప్రభావం, థియేటర్ టికెట్ రేట్లు, పెరిగిన నిర్మాణ వ్యయాలు, షూటింగ్లో వృథా ఖర్చు..ఇలాంటి అంశాలన్నింటిపై నిర్మాతలందరూ కలిసి సమగ్రంగా చర్చించుకోబోతున్నాం. ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత తిరిగి షూటింగ్స్ మొదలుపెడతాం. ఈ సమయంలోనే 24 విభాగాల సినీ కార్మికుల వేతనాల అంశం కూడా పరిష్కరించాలని భావిస్తున్నాం’ అని చెప్పారు. హైదరాబాద్లో షూటింగ్ చేసే పరభాషా చిత్రాలు యథావిధిగా చిత్రీకరణలు జరుపుకోనున్నాయి.