Rave Party | కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru)లో ఓ రేవ్ పార్టీ జరిగినట్లు.. ఇందులో టాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు ఉన్నట్లు ఉదయం నుంచి వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ రేవ్ పార్టీలో టాలీవుడ్ సీనియర్ నటి హేమ కూడా ఉందని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ వార్తలపై హేమ క్లారిటీ ఇస్తూ తాజాగా ఓ వీడియోని రిలీజ్ చేసింది.
ఈ వీడియోలో హేమ మాట్లాడుతూ.. నేను ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉన్నాను. ఇక్కడ హైదరాబాద్ ఫామ్ హౌస్‌లోనే ఉండి ఎంజాయ్ చేస్తున్నాను. నాకు బెంగుళూరు రేవ్ పార్టీతో సంబంధం లేదు. ఇందులోకి కొందరు నన్ను అనవసరంగా లాగుతున్నారు. కన్నడ మీడియా, సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదు అంటూ క్లారిటీ ఇచ్చింది.
అది ఫేక్ న్యూస్! నాకు రేవ్ పార్టీ తో సంబంధం లేదు.. క్లారిటీ ఇచ్చిన హేమ pic.twitter.com/gietlinFyZ
— Namasthe Telangana (@ntdailyonline) May 20, 2024
ఇంతకీ ఏం జరిగిందంటే.. బెంగళూరు (Bengaluru) సమీపంలో నిన్న రేవ్‌పార్టీ (Rave Party) జరిగింది. ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని బీఆర్ ఫామ్‌హౌస్‌లో బర్త్‌డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున రేవ్ పార్టీని నిర్వహించారు. ఈ పార్టీలో మందుతోపాటు పెద్ద ఎత్తున మత్తుపదార్థాలను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు టీవీ నటీనటులు (Telugu Stars), మోడళ్లు, బడాబాబులు పట్టుబడ్డారు.
ఫామ్‌హౌస్‌లో బర్త్‌డే పార్టీ జరుగుతున్నట్లు పక్కా సమాచారంతో పోలీసులు ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత అక్కడికి చేరుకొని దాడి చేశారు. ఏపీ, బెంగళూరుకు చెందిన దాదాపు 100 మందికిపైగా పార్టీకి హాజరయ్యారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పార్టీలో పలు రకాల డ్రగ్స్ వాడినట్లు గుర్తించి సీజ్ చేశారు. 17 గ్రాముల ఎండీఎంఏ పిల్స్, కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఫామ్ హౌస్ సమీపంలో బెంజ్, జాగ్వార్, ఆడీ సహా ఖరీదైన 15 కార్లను జప్తు చేశారు. రేవ్ పార్టీలో ఏపీకి చెందిన ఎమ్మెల్యే కాకాణి గోవర్ధనరెడ్డి పేరుతో పాస్ ఉన్న బెంజ్ కారు సైతం లభ్యమైనట్లు సమాచారం. పార్టీ జరిగిన ఫామ్‌హౌస్ హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారవేత్తకు చెందినదిగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.