థియేటర్లో విడుదలైన సినిమా ఓటీటీ విడుదలకు పరిమితి పెడితేనే థియేటర్ వ్యవస్థను కాపాడుకుంటాం అని తెలుగు సినిమా నిర్మాతలు యోచిస్తున్నారు. ఇందుకోసం ఓటీటీ విడుదలకు ఓ పరిమితి పెట్టుకోవాలని భావిస్తున్నారు. బుధవారం నిర్మాతలు సమావేశమై ఈ విషయంపై చర్చలు జరిపారు. ఆ సమావేశంలో థియేటర్లో సినిమా విడుదలైన 50 రోజుల తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. జూలై 1నుంచి విడుదలయ్యే సినిమాల నుంచి ఈ నిబంధనలు వర్తింపజేయాలని వారు అనుకుంటున్నారు. థియేటర్లో సినిమా ప్రదర్శితమై పంపిణీదారులకు పెట్టుబడులు రావాలంటే ఓటీటీకి కనీసం ఈ పరిమితి తప్పదని వారంటున్నారు. ఇటీవల కొన్ని పెద్ద చిత్రాలు మూడు నాలుగు వారాల్లోపే ఓటీటీలోకి ప్రీమియర్ అయ్యాయి. దాంతో డిస్ట్రిబ్యూటర్స్ తీవ్రంగా నష్టపోయారు. ఈ నేపథ్యంలో నిర్మాతలు ఓటీటీ పరిమితిపై చర్చలు జరుపుతున్నారు. ఒక ఆడని సినిమాను థియేటర్లో జనం చూడక, ఇటు ఓటీటీకి త్వరగా ఇవ్వకపోతే నిర్మాత రెండు విధాలుగా నష్టపోతాడనే అభిప్రాయమూ కొందరు నిర్మాతల నుంచి వినిపిస్తున్నది. దీనిపై అధికారికంగా నిర్మాతల మండలి నుంచి ప్రకటన వెలువడాల్సిఉంది.