Seven Hills Satish | సెవెన్ హిల్స్ సతీశ్ ఇప్పుడు ప్రొడ్యూసర్ నుంచి డైరెక్టర్‌గా మారుతున్నాడు. తన పుట్టిన రోజు సందర్భంగా ప్రెస్‌మీట్ పెట్టి మరి ఈ విషయాన్ని వెల్లడించారు. నూతన ప్రయాణం మొదలుపెడుతున్నానని ప్రకటించారు. డైరెక్టర్ కావాలనే లక్ష్యంతో సినీ ఇండస్ట్రీకి వచ్చిన తాను నిర్మాతగా తన కెరీర్‌ను ప్రారంభించానని తెలిపారు. నిర్మాణానికి సంబంధించి అన్ని నేర్చుకుని పూర్తిగా సన్నద్ధం అయిన తర్వాత తన లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పారు.
వచ్చే ఏడాదిలో దర్శకుడిగా మారబోతున్నట్లు సెవెన్ హిల్స్ సతీశ్ తెలిపారు. తన స్నేహితుల సహాయంతో వాళ్ల నిర్మాణంలోనే తన మొదటి సినిమా డైరెక్షన్ చేయబోతున్నట్లు పేర్కొన్నారు. తొలిసారి మీడియా సమక్షంలో కేక్ కట్ చేసి గ్రాండ్‌గా బర్త్ డే జరుపుకోవడం కొత్తగా ఉందన్నారు. ప్రభాస్ పుట్టినరోజే తన బర్త్ డే కావడం హ్యాపీగా ఉందని తెలిపారు. ఇక సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బట్టల రామస్వామి బయోపిక్, కాఫీ విత్ ఏ కిల్లర్, సోలోబాయ్ సినిమాలను సెవెన్ హిల్స్ సతీశ్ నిర్మించారు. మరో రెండు సినిమాలను తన బ్యానర్లో తీయబోతున్నట్లు ప్రకటించారు. ఎడిటర్ ప్రవీణ్ పూడి దర్శకత్వంలో ఒక సినిమా తీస్తున్నామని, రాజశేఖర్ గడ్డం దర్శకత్వంలో మరో సినిమా స్క్రిప్ట్ దశలో ఉందని చెప్పారు. నార్నె నితిన్ హీరోగా ఉగాది రోజున ప్రారంభమైన సినిమా అనుకోకుండా పట్టాలెక్కకపోవడంతో ఆ కథను సరికొత్తగా మార్చి త్వరలో సినిమా చేస్తున్నామని తెలిపారు. ఈ రెండు సినిమాల అప్డేట్స్ వచ్చే ఏడాదిలో ఇస్తామన్నారు.
నేను నిర్మించిన మూడు సినిమాలు కూడా కొత్త వాళ్లతో చేశాను. డైరెక్టర్‌గా కూడా కొత్తవాళ్లతో చేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే కొత్తవాళ్లతో చేస్తే డేట్స్ ఇబ్బంది ఉండదు. ఎవరైనా హీరో ఓకే అయినా చేస్తా. వేరే ఏ భాష నుంచి వచ్చిన సినిమా అయినా బాగుంటే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. ఇక మనం చేసే మంచి సినిమాను ఇంకెంతగా ఆదరిస్తారో అందరికీ తెలిసిందే. రివ్యూలు జెన్యూన్‌గా ఇస్తే మరిన్ని మంచి సినిమాలు వస్తాయి. డైరెక్టర్‌గా నేను ఏంటనేది నిరూపించుకుంటే తర్వాత పాన్ ఇండియా సినిమా చేయడానికి సిద్ధం. లిటిల్ హార్ట్స్ లాంటి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తే దర్శకులకు మంచి గుర్తింపు ఉంటుంది. అలాంటి సినిమా తీసి దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఉంది. నా ఫేవరెట్ హీరో నాని. ఆయనతో సినిమా చేయాలని ఉంది.’’ అని తెలిపారు