Bellamkonda Suresh | బంజారాహిల్స్, జూన్ 9: సినీ నిర్మాత బెల్లంకొండ సురేశ్ ఇంటిముందు పార్క్ చేసిన కారు అద్దాలను ధ్వంసం చేసిన దుండగులు.. కారు డిక్కీలోంచి ఖరీదైన విదేశీ మద్యం బాటిళ్ల, నగదు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
జూబ్లీహిల్స్‌లోని జర్నలిస్ట్ కాలనీలో నివాసముంటున్న సినీ నిర్మాత బెల్లంకొండ సురేశ్‌కు చెందిన మెర్సిడెజ్ బెంజ్ కారును ఇంటికి ఎదురుగా రోడ్డుపై పార్క్ చేశారు. ఈ కారు అద్దాన్ని ధ్వంసం చేసిన గుర్తుతెలియని వ్యక్తులు.. కారు డిక్కీలోనుంచి రూ.50వేల నగదు, 11 రాయల్ సెల్యూట్ మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లారు. శుక్రవారం మధ్యాహ్నం ఈ విషయాన్ని గమనించిన బెల్లంకొండ సురేశ్ కుటుంబ సభ్యులు.. డయల్ 100కు ఫోన్ చేయగా సంఘటనా స్థలానికి చేరుకున్న జూబ్లీహిల్స్ క్రైం పోలీసులు వివరాలు సేకరించారు. బాటిళ్ల విలువ సుమారు రూ.3లక్షల వరకు ఉంటుందని తెలిసింది. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో సమీపంలోని సీసీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇదిలా ఉండగా.. కారు డిక్కీలో ఖరీదైన మద్యం బాటిళ్లు ఉన్నాయన్న విషయం తెలిసిన వ్యక్తులే ఈ చోరీకి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.