Tollywood| ఇటీవలి కాలంలో సినిమాల రిలీజ్‌ల విషయంలో నిర్మాతలు కూడా సరైన క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. అందుకు చాలా కారణాలు ఉన్నాయి. అయితే ఈ మధ్య టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలు వాయిదాల మీద వాయిదా పడుతున్నాయి. అందులో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు గురించి చెప్పుకోవాలి. ఈ మూవీ 4 ఏళ్లనుంచి షూటింగ్ జరుగుతూనే ఉంది. ఇదిగో అయిపోతోంది.. అదిగో అయిపోతోందని అనడం తప్ప సరైన రిలీజ్ డేట్ ఇవ్వలేకపోతున్నారు. మార్చి 28న ఎట్టిపరిస్తితుల్లో సినిమా రిలీజ్ చేస్తామన్న నిర్మాత ఎ.ఎమ్ రత్నం ఈసారి కూడా పోస్ట్ పోన్ చేసే అవకాశం కనిపిస్తుంది.
ఇక ప్రభాస్ సినిమా కూడా వాయిదాల మీద వాయిదాలు పడుతుంది. 2022లో మొదలైన రాజాసాబ్ కూడా ఇంకా షూటింగ్ సాగిస్తూనే ఉంది. హార్రర్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ చిన్న సినిమాగా మొదలైంది. కాని ప్రభాస్ బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ తో సినిమా రేంజ్ ని పెంచేశారు . స్టార్ క్యాస్ట్, స్కేల్ అన్ని విషయాలు పెంచేయడంతో మూడేళ్ల నుండి షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. ఏప్రిల్ 10న థియేటర్లోకొస్తున్నట్టు అనౌన్స్ చేసిన రాజాసాబ్ షూట్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి. ఇక చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమా పరిస్థితి కూడా అలానే ఉంది. ఈ సంవత్సరం సంక్రాంతికి రిలీజ్ కావల్సిన సినిమాని పోస్ట్ పోన్ చేశారు. సీజీ వర్క్ బ్యాలెన్స్ ఉండడంతో సమ్మర్‌కి వస్తుందనుకున్న ఈ మూవీ రిలీజ్‌కి మరి కొద్ది రోజులు సమయం పట్టేలా కనిపిస్తుంది.
శేఖర్ కమ్ముల డైరెక్షన్లో నాగార్జున, ధనుశ్ , రష్మిక లీడ్ రోల్స్ లో సోషల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న కుబేర మూవీ గత ఏడాది నుండి షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. ఇప్పటికీ షూటింగ్ కంప్లీట్ కాలేదు. జూన్ 20న చిత్రాన్ని థియేటర్స్‌లోకి తీసుకొస్తామని అన్నారు కాని వచ్చే వరకు పక్కాగా చెప్పలేని పరిస్థితి. నితిన్ లాంటి మీడియం హీరోలు కూడా సంవత్సరాలు టైమ్ తీసుకుంటున్నారు . 2023లో మొదలైన తమ్ముడు సినిమా ఇంకా కంప్లీట్ కాలేదు. షూట్ కంప్లీట్ అవ్వకపోవడంతో రిలీజ్ డేట్ అనౌన్స్ చెయ్యలేదు. ఇవే కాదు మరి కొన్ని సినిమాలు కూడా షూటింగ్ జరుపుకుంటున్నాయి. అవి ఎప్పుడు థియేటర్స్‌లోకి వస్తాయా అని ప్రేక్షకులు ఆసక్తిగా గమనిస్తున్నారు.