Tollywood | ఒకప్పుడు కలగా కనిపించిన 1000 కోట్ల క్లబ్ ఇప్పుడు టాలీవుడ్‌కు కామన్ టార్గెట్‌గా మారిపోయింది. ‘బాహుబలి’, ‘ఆర్ ఆర్ ఆర్’, ‘పుష్ప’, ‘కల్కి 2898 ఏడీ’ లాంటి చిత్రాలు వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతో, ఇప్పుడు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద టాలీవుడ్ యావరేజ్ టార్గెట్ 2000 కోట్లుగా మారిందనే చెప్పాలి. ఇక ఎస్ఎస్ఎంబీ 29 (వారణాసి), అల్లు అర్జున్ 26వ చిత్రం అయితే మరింత హైప్ తెచ్చుకుంటూ, ఏకంగా 3000 కోట్ల టార్గెట్‌తో బరిలోకి దిగుతున్నాయన్న ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే… 2025లో మాత్రం టాలీవుడ్ నుంచి ఒక్క 1000 కోట్ల సినిమా కూడా రాలేదు.
సంక్రాంతి తర్వాత విడుదలైన చిత్రాలన్నీ ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయాయి. భారీ అంచనాల మధ్య రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ పాన్ ఇండియా రిలీజ్ అయినా, బాక్సాఫీస్ వద్ద అనుకున్న ఫలితాలను రాబట్టలేకపోయింది. ఆ తర్వాత కూడా ఆ రేంజ్లో విడుదలైన సినిమా ఏదీ లేకపోవడంతో, చాలా చిత్రాలు రీజనల్ మార్కెట్‌కే పరిమితమయ్యాయి. ఈ ఏడాదిలో పెద్ద విజయం సాధించిన చిత్రంగా చెప్పుకోవాల్సింది ‘సంక్రాంతికి వస్తున్నాం’ మాత్రమే. పాన్ ఇండియా రిలీజ్ కాకపోయినా, రీజనల్ మార్కెట్లోనే ఈ చిత్రం దాదాపు 300 కోట్ల వసూళ్లు సాధించింది. వెంకటేష్ ఇమేజ్, అనిల్ మార్క్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడంతో ప్రేక్షకులతో బాగా కనెక్ట్ అయ్యింది.
ఇక అసలు ప్రశ్న ఏంటంటే… 2026లో టాలీవుడ్ నుంచి మళ్లీ 1000 కోట్ల సినిమా వస్తుందా? అంటే అవుననే టాక్ గట్టిగానే వినిపిస్తుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’పై ఇండస్ట్రీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా మార్చిలో పాన్ ఇండియాలో రిలీజ్ కానుంది. అలాగే డార్లింగ్ ప్రభాస్ నటిస్తున్న ‘ది రాజాసాబ్’ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సస్పెన్స్ కామెడీ థ్రిల్లర్‌ను ప్రభాస్ ఇమేజ్ను దృష్టిలో పెట్టుకుని పాన్ ఇండియాలో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు కూడా ప్రారంభమయ్యాయి. అయితే ఈ సినిమాలు 1000 కోట్ల క్లబ్‌లోకి వెళ్తాయా? అన్నది ఇప్పుడే చెప్పడం కష్టం. ముఖ్యంగా నార్త్ బెల్ట్ ఆడియన్స్‌కు కంటెంట్ ఎంతగా కనెక్ట్ అవుతుందన్నదే కీలకం. ‘పుష్ప’లా అక్కడ క్లిక్ అయితే, వసూళ్లతో బాక్సాఫీస్ మోతెక్కడం ఖాయం.
ఇదే ఏడాది ప్రభాస్ నటిస్తున్న మరో భారీ చిత్రం ‘ఫౌజీ’ కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాపై ఇండియా వైడ్‌గా భారీ అంచనాలున్నాయి. ‘పెద్ది’ కంటే కూడా ఈ సినిమాపై ఎక్కువ హైప్ ఉందనే మాట వినిపిస్తోంది. గత గణాంకాలను పరిశీలిస్తే… టాలీవుడ్ నుంచి వచ్చే ఏ పాన్ ఇండియా సినిమా అయినా నార్త్ బెల్ట్ నుంచి కనీసం 200 కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తేనే 1000 కోట్ల క్లబ్ సాధ్యం అవుతుందన్నది స్పష్టమవుతోంది. మరి 2026లో ఆ మ్యాజిక్ ఎవరు రిపీట్ చేస్తారో చూడాల్సిందే.