Tollywood | సినిమా వాళ్లకి దసరా, సంక్రాతి వస్తున్నాయంటే మాములు ఆనందం కాదు. ఎందుకంటే ఆ సమయంలో ఎక్కువ రోజులు సెలవులు ఉంటాయి, చాలా మంది ఫ్యామిలీలతో కలిసి సినిమాలకి వెళతారు. దాంతో బాక్సాఫీస్ కళకళలాడుతుంది. అందుకే పెద్ద హీరోలు ఎక్కువగా దసరా, సంక్రాంతి పండుగలని టార్గెట్ చేసి తమ సినిమాలకి భారీ వసూళ్లు వచ్చేలా చూస్తున్నారు. అయితే ప్రతి ఏడాది లాగానే దసరాకి భారీ సినిమాలు రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతానికి అయితే అఫీషియల్‌గా ఏ సినిమా వస్తుంది అనే క్లారిటీ ఇవ్వలేదు కాని కొన్ని మాత్రం దసరా బరిలో నిలిచేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది.
ముఖ్యంగా బోయపాటి శ్రీను డైరెక్షన్ లో బాలయ్య హీరోగా తెరకెక్కుతున్న అఖండ2 సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. దసరాకి ఈ మూవీ రిలీజ్ చేస్తే బాగుంటుందని మేకర్స్ భావిస్తున్నారట. ఇక మెగా మేనల్లుడు సాయి తేజ్ సంబరాల యేటి గట్టు సినిమాని కూడా దసరాకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాడట. రోహిత్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాని దసరా బరిలో నిలిపేలా గట్టిగా ప్లాన్స్ చేస్తున్నారట. ఇక వీటితో పాటుగా రెబల్ స్టార్ నటిస్తున్న రాజా సాబ్ ని కూడా దసరా బరిలో దించే ప్లానింగ్ అయితే చేస్తున్నారని టాక్. ఎప్పుడో రిలీజ్ కావల్సిన ఈ చిత్రం పలు కారణాల వలన వాయిదా పడుతూ వచ్చింది.
ఇక బాక్సాఫీస్ దగ్గర డబ్బింగ్ సినిమాల హవా కూడా మాములుగా లేదు. స్టార్ హీరోలు నటించిన కొన్ని డబ్బింగ్ సినిమాలని కూడా దసరా బరిలో నిలిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. ఇన్ని సినిమాలు ఒకేసారి రిలీజ్ అయితే థియేటర్స్ సమస్య వస్తుందని తెలిసిన కూడా నిర్మాతలు తగ్గేదే లే అంటున్నారట. మెగాస్టార్ చిరంజీవి నటించిన విశ్వంభర సినిమా కూడా ఎప్పుడో రిలీజ్ కావలసి ఉన్నా కూడా పలు కారణాల వలన లేట్ అవుతుంది. ఈ మూవీ జూన్, జూలై రిలీజ్ అంటున్నారు. ఒకవేళ ఆ సినిమా కూడా దసరాకి వస్తే మాత్రం సంథింగ్ స్పెషల్ గా ఉంటుంది అనే చెప్పాలి. మొత్తానికి ఏయే సినిమాలు దసరా బరిలో నిలుస్తాయా అని ఫ్యాన్స్ ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ సినిమాల ఫైట్ తో దసరా మరింత కలర్ ఫుల్ అవుతుందని ఫ్యాన్స్ ముచ్చటించుకుంటున్నారు.