Hanuman | ఇండస్ట్రీలో కూడా ప్రశాంత్ వర్మ పేరు ఎక్కువగా వినిపిస్తుందిప్పుడు. ఎందుకంటే పెద్ద పెద్ద దర్శక నిర్మాతలు తన దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నా కూడా హనుమాన్ వాయిదా వేయడానికి ఆయన అసలు ఒప్పుకోవడం లేదు. దానికోసం తన దగ్గరికి ఎవరు వచ్చినా కూడా ససేమిరా అంటున్నాడు ప్రశాంత్ వర్మ. తన ప్రాజెక్టు మీద ఎంత నమ్మకం ఉందో.. సంక్రాంతి రిలీజ్ డేట్ మీద కూడా అంతే నమ్మకంగా ఉన్నాడు ఈయన. అందుకే అందరి కంటే ముందు తన సినిమా విడుదల తేదీని ప్రకటించాడు ప్రశాంత్ వర్మ. అనుకున్నట్టుగానే జనవరి 12న హనుమాన్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాడు.
ఇదిలా ఉంటే సంక్రాంతికి మరో 3-4 సినిమాలు కూడా వస్తున్నాయి. అయితే చివరి నిమిషం వరకు అయినా హనుమాన్ నిర్మాతలను ఒప్పించి పోస్ట్ పోన్ చేయాలి అనుకుంటున్న తరుణంలో.. అందరికంటే ముందు సెన్సార్ కంప్లీట్ చేసుకుంది ఈ సినిమా. దాంతో రిలీజ్ డేట్లో ఇక వాయిదాలు లేవు.. డైరెక్ట్ అటాక్ అని అనౌన్స్ చేశాడు ప్రశాంత్ వర్మ. ఈయన ప్లానింగ్ ఈ రేంజ్లో ఉన్నప్పుడు ఎవరు మాత్రం ఏం చేస్తారు అంటూ అందరూ సైలెంట్ అయిపోతున్నారు. సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది అని ఇన్సైడ్ రిపోర్ట్స్ బలంగా వినిపిస్తూ ఉండటంతో నిర్మాతలు కూడా ఎక్కడా తగ్గడం లేదు.
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ ‘హను-మాన్’. ఇప్పటివరకు సూపర్ మాన్ సినిమాలు అంటే కేవలం హాలీవుడ్ మాత్రమే గుర్తుకొస్తుంది. కానీ మన హనుమంతుడిని మించిన సూపర్ మాన్ మరొకరు ప్రపంచంలో లేరని ఈ సినిమాతో చూపించబోతున్నాడు ప్రశాంత్ వర్మ. కచ్చితంగా పిల్లలకు కుటుంబాలకు ఈ సినిమా బాగా నచ్చుతుందని గట్టి నమ్మకంతో ఉన్నాడు ఈయన. తేజ సజ్జా ఏ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఆయన మార్కెట్‌తో సంబంధం లేకుండా భారీ బడ్జెట్‌తో హనుమాన్ సినిమాను తీసుకొస్తున్నారు.
తాజాగా సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డు. జనవరి 12 ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది హనుమాన్. హను-మాన్ తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్తో సహా పలు భారతీయ భాషల్లో పాన్ వరల్డ్ విడుదల కానుంది. మరి చూడాలిక ఈ సినిమా ఎంతవరకు అలరిస్తుందో..?