Anil Ravipudi | ఈ రోజుల్లో దర్శకులు చాలా తెలివిగా ఉన్నారు. ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే తర్వాతి సినిమాను కూడా లాక్ చేస్తున్నారు. హిట్టు ప్లాప్స్తో సంబంధం లేకుండా స్టార్ హీరోను పట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు బాగా సక్సెస్ అవుతున్నారు.. మరికొందరు ప్రాజెక్టు సెట్ చేసుకున్న తర్వాత కూడా దాన్ని హ్యాండిల్ చేయలేక వదిలి పెడుతున్నారు. లైగర్ సమయంలోనే జనగణమన విజయ్ దేవరకొండతో అనౌన్స్ చేశాడు పూరి. కానీ లైగర్ ఫ్లాప్ అవ్వడంతో ఆ సినిమా ఆగిపోయింది. అదే సమయంలో బీస్ట్ సెట్స్ మీద ఉండగానే జైలర్ అనౌన్స్ చేశాడు నెల్సన్. ఆ సినిమా ఫలితం పట్టించుకోకుండా రజనీకాంత్ అవకాశం ఇచ్చాడు. దాని ఫలితం 650 కోట్ల బ్లాక్ బస్టర్.
ఇప్పుడు అనిల్ రావిపూడి కూడా తన నెక్స్ట్ సినిమా కోసం సెర్చింగ్ మొదలుపెట్టాడు. ప్రస్తుతం స్టార్ హీరోలు అందరూ చాలా బిజీగా ఉన్నారు. ఒక్కొక్కరు రెండు మూడు సినిమాలు కమిట్ అయిపోయారు. వాళ్లలో ఏ ఒక్కరితో సినిమా చేయాలన్న కనీసం రెండేళ్లు వెయిట్ చేయాలి. అంత టైం అనిల్ దగ్గర లేదు. అందుకే తనకు అనుకూలంగా ఉన్న హీరో వైపు చూస్తున్నాడు అనిల్ రావిపూడి. ప్రస్తుతం భగవంత్ కేసరి పనులతో బిజీగా ఉన్న అనిల్.. దీని విడుదల తర్వాత నెక్స్ట్ సినిమా గురించి ఆలోచించనున్నాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న వార్తల ప్రకారం చూసుకుంటే అనిల్ నెక్స్ట్ సినిమా చిరంజీవితో ఉండే అవకాశం ఉంది. ఈ మధ్య మెగాస్టార్ ను కలిసి కథ కూడా చెప్పాడని తెలుస్తుంది. దీని మీద ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
ఒకవేళ అదే నిజమైతే చిరంజీవి కూడా అనిల్ తో సినిమా చేయడానికి పెద్దగా ఆలోచించకపోవచ్చు. ఎందుకంటే ఆయన ట్రాక్ రికార్డు అలా ఉంది. పైగా కమర్షియల్ సినిమాలకు పెట్టింది పేరు అనిల్ రావిపూడి. మెగాస్టార్ కు సరిపోయే టైలర్ మేడ్ క్యారెక్టర్ రాయడానికి అనిల్‌కు పెద్దగా టైం పట్టదు. అందుకే చిరంజీవి కూడా ఆయన మీద ఆసక్తి చూపిస్తున్నాడు. చిరుతో కాకపోతే ఎఫ్-2 బాలీవుడ్ రీమేక్ చేయాలనే ప్లాన్‌లో కూడా అనిల్ ఉన్నాడు. కానీ ఇక్కడ ప్యూర్‌గా వెంకటేశ్ కామెడీ టైమింగ్‌తో సినిమా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయింది. ఇలాంటి సినిమా బాలీవుడ్లో వర్కౌట్ అవుతుందా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఒకవేళ ఈ రెండు కాదంటే మహేశ్ బాబుతో సినిమా చేయాలనేది అనిల్ ప్లానింగ్. మొత్తానికి బాలయ్య సినిమా హిట్ అయ్యిందంటే మాత్రం మూడు ఆప్షన్స్‌లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటాడు అనిల్ రావిపూడి.