Tollywood | 2025 క్రిస్మస్ సందర్భంగా తెలుగు సినిమా థియేటర్లు సినిమాలతో కళకళలాడనున్నాయి. పండుగ హాలిడేను టార్గెట్ చేస్తూ ఏకంగా ఆరు సినిమాలు ఒకే రోజు విడుదలకు సిద్ధమయ్యాయి. ఛాంపియన్, శంభాల, పతంగ్, దండోరా, ఈషా వంటి తెలుగు చిత్రాలతో పాటు, మోహన్‌లాల్ నటించిన వృషభ కూడా నేడు థియేటర్లలోకి అడుగుపెడుతోంది. దీంతో ఈ క్రిస్మస్ బాక్సాఫీస్ వద్ద హోరాహోరీ పోటీ తప్పదనేలా కనిపిస్తోంది. ఈ క్రిస్మస్ విడుదలలలో అత్యధిక అంచనాలు నెలకొన్న చిత్రం రోషన్ హీరోగా నటించిన ‘ఛాంపియన్’. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా 169 నిమిషాల రన్టైమ్తో U/A సర్టిఫికెట్‌ను పొందింది.
ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, ట్రైలర్, పాటలు మంచి స్పందన తెచ్చుకున్నాయి. యువతతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునే అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం క్రిస్మస్ విన్నర్ అవుతుందనే అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి. మరికొద్ది నిమిషాలలో ఈ సినిమా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలవుతోంది. ఇక ఆది సాయికుమార్ నటించిన ‘శంభాల’ కూడా క్రిస్మస్ రేసులో కీలకంగా నిలుస్తోంది. ఈ చిత్రానికి A సర్టిఫికెట్ లభించగా, రన్‌టైమ్ 144 నిమిషాలుగా ఉంది. ఇంటెన్స్ థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన ఈ సినిమాపై యువ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. రిలీజ్‌కు ముందే టీమ్ భారీగా ప్రమోషన్లు చేయడంతో సినిమాపై హైప్ మరింత పెరిగింది. ఈ చిత్రం కూడా నేడు థియేటర్లలోకి వస్తోంది.
శివాజీ, నవదీప్, బిందు మాధవి ప్రధాన పాత్రల్లో నటించిన ‘దండోరా’ కూడా క్రిస్మస్ బరిలో ఉంది. కంటెంట్ ఓరియెంటెడ్ కథతో తెరకెక్కిన ఈ సినిమా సామాజిక అంశాలను స్పృశిస్తుందని ప్రచారం జరుగుతోంది. ఆసక్తికరమైన తారాగణం, డిఫరెంట్ నేరేషన్‌తో ఈ చిత్రం ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచింది. దండోరా మూవీ ఇప్పటికే ప్రదర్శితం కాగా, టాక్ కూడా బయటకు వచ్చినట్టు తెలుస్తుంది. ఇక హారర్ ఎంటర్టైనర్గా రూపొందిన హెబా పటేల్ నటించిన ‘ఈషా’ మరో ప్రత్యేక ఆకర్షణ. భయంతో పాటు వినోదాన్ని మిళితం చేసిన కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాకు మంచి బజ్ ఏర్పడింది. ఈ మూవీకి ఇప్పటికే ప్రీమియర్లు నిర్వహించినట్టు తెలుస్తుంది. మరి కొద్ది నిమిషాలలో థియేటర్స్ లో విడుదల కానున్న ఈ సినిమా హారర్ సినిమాలను ఇష్టపడే వారికి బాగా నచ్చుతుంది.
మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ నటించిన ‘వృషభ’ తెలుగు వెర్షన్ కూడా క్రిస్మస్ సందర్భంగా థియేటర్లలో విడుదలవుతోంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ సినిమాపై మోహన్‌లాల్ అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. అలాగే ‘పతంగ్’ చిత్రం కూడా ఇదే రోజు విడుదలై తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. మొత్తంగా చూస్తే, 2025 క్రిస్మస్కు విడుదలవుతున్న సినిమాల్లో రోషన్ ‘ఛాంపియన్’, ఆది సాయికుమార్ ‘శంభాల’ సినిమాలకు గట్టిపోటీ హైప్ కనిపిస్తోంది. విభిన్న జానర్లలో తెరకెక్కిన ఈ చిత్రాలు ప్రేక్షకులను థియేటర్లకు ఎంతవరకు ఆకర్షిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. చివరికి క్రిస్మస్ బాక్సాఫీస్ విన్నర్ ఏ సినిమా అవుతుందో చూడాల్సిందే.