Tollywood| పాత హీరోయిన్స్ గురించి ఇప్పటి తరం వారికి పెద్దగా తెలియకపోవచ్చు. అయితే ఆ కాలంలో అందాల ముద్దుగుమ్మలు చాలా మందే ఉన్నారు. వారిలో ఒకరు లైలా. గోవాలో పుట్టి పెరిగిన ఈ అందాల ముద్దుగుమ్మ… ‘దుష్మన్ దునియా కా’ అనే బాలీవుడ్ సినిమాతో తెరంగేట్రం చేసింది. ఈ సినిమా తర్వాత మలయాళంలో ‘ఇద ఒరు స్నేహకాద’ అనే సినిమా చేసింది. ఆ తర్వాత విజయకాంత్ నటించిన ‘కళళగర్’ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఆ తర్వాత తమిళ, తెలుగు భాషల్లో వరుస అవకాశాలు అందుకుంది ఈ అందాల ముద్దుగుమ్మ.
లైలా తెలుగులో ‘ఎగిరే పావురమా’, ‘పెళ్లి చేసుకుందాం’, ‘ఉగాది’, ‘ఖైదీ గారు’, ‘పవిత్ర ప్రేమ’, ‘లవ్ స్టోరీ 1999’, ‘శుభలేఖలు’, ‘నా హృదయంలో నిదురించే చెలి’ వంటి చిత్రాలు చేసి ఇక్కడి ప్రేక్షకుల మనసులు దోచుకుంది. ఇక తరుణ్ నటించిన నువ్వే కావాలి చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్తో దుమ్ము రేపింది. అయితే 2006లో ఒక మలయాళ సినిమాలో నటించిన లైలా, విదేశీ వ్యాపారవేత్తను ప్రేమించి పెళ్లి చేసుకుని ఇక సినిమాల నుండి తప్పుకుంది. ఇక వీరి సంసార జీవితంలో ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. 90ల అభిమానుల కలల రాకుమారిగా వెలుగొందిన లైలా… ఇటీవల తనకున్న వింత వ్యాధి గురించి చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది.
లైలా అసలు ప్రాబ్లమ్ ఏంటంటే.. ఆమె ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుందట. ఈమెకి ఉన్న వింత సమస్యని గుర్తించిన హీరో విక్రమ్… శివపుత్రుడు షూటింగ్ స్పాట్లో ఒక్క నిమిషం కూడా నవ్వకుండా ఉండాలని లైలాకు ఛాలెంజ్ విసరగా, ఆమె 30 సెకన్లలో ఏడ్చేసిందట. దాంతో లైలా వేసుకున్న మేకప్ అంతా కరిగిపోయిందని చెప్పుకొచ్చింది. లైలా నవ్వుతూ ఉంటేనే బాగుంటుంది. ఆమె కనుక నవ్వు ఆపేస్తే వెంటనే తన కంటి నుండి కన్నీళ్లు వచ్చేస్తాయట. తనకి తెలియకుండానే అలా కంటి నుండి కన్నీళ్లు వచ్చేస్తాయని, లైలా ఇప్పటికీ అలాంటి వింత వ్యాధితో బాధపడుతున్నట్టుగా తెలుస్తుంది. పాపం లైలాకి ఉన్న ఈ విచిత్రమైన వ్యాధి గురించి తెలుసుకున్న ఆమె అభిమానులు కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.