Mrunal Thakur | ‘కెరీర్ విషయంలో పెద్దగా ప్రణాళికలు వేసుకోలేదు. మనసుకు నచ్చిన కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నా. నటిగా ప్రతీ సినిమాకు పరిణతి సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నా’ అని చెప్పింది మరాఠీ భామ మృణాల్ ఠాకూర్. టీవీ ధారావాహికల ద్వారా కెరీర్ను మొదలుపెట్టిన ఈ అమ్మడు ప్రస్తుతం దక్షిణాది అగ్ర కథానాయికల్లో ఒకరిగా చలామణీ అవుతున్నది. హిందీలో కూడా భారీ అవకాశాలతో దూసుకుపోతున్నది. ‘సీతారామం’ చిత్రం ద్వారా తెలుగులో తిరుగులేని గుర్తింపును దక్కించుకున్న ఈ భామ ప్రస్తుతం భారీ సినిమాల్లో అవకాశాలను దక్కించుకుంటున్నది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘ఒక్కోసారి ఆలోచిస్తే నా సినీ ప్రయాణం ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది. మరాఠీ చిత్రాల్లో రాణిస్తే చాలనుకునే స్థాయి నుంచి నేడు పాన్ ఇండియా రేంజ్లో అవకాశాలు దక్కించుకోవడం అదృష్టంగా భావిస్తున్నా. నా కెరీర్లో ఏదీ ప్లాన్ చేసుకోకుండానే జరిగిపోతున్నది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ వందశాతం పాత్రకు న్యాయం చేయడంపైనే దృష్టి పెడుతున్నా’ అని చెప్పింది. ప్రస్తుతం ఈ భామ తెలుగులో నాని, విజయ్ దేవరకొండ చిత్రాల్లో కథానాయికగా నటిస్తున్నది.