Tollywood Actors | 2025కి కౌంట్‌డౌన్ దగ్గరపడుతున్న విషయం తెలిసిందే. కొత్త ఏడాదికి ఇంకా 13 రోజులు కూడా లేదు. అయితే ఈ ఇయర్ టాలీవుడ్‌కి సంబంధించి ఏకంగా 13 మంది హీరోలు ఒక్క సినిమా కూడా విడుదల చేయకుండానే 2024ను ముగిస్తున్నారు. ఇందులో అగ్ర నటులు మెగాస్టార్ చిరంజీవితో పాటు తదితరులు ఉన్నారు. ఇక వాళ్లు ఎవరు అనేది చూసుకుంటే..?
ఈ ఏడాది టాలీవుడ్‌కి మంచి సూపర్ హిట్లు అందుకున్న హీరోలు అంటే ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ అని చెప్పకతప్పదు. ‘కల్కి’ రూపంలో ప్రభాస్ టాలీవుడ్‌కి సూపర్ హిట్‌ని ఇవ్వగా.. ఆ తర్వాత ‘దేవర’ అంటూ వచ్చి ఎన్టీఆర్ మరో హిట్‌ని అందించాడు. అనంతరం అల్లు అర్జున్ ‘పుష్ప 2’ రూపంలో ఏకంగా బ్లాక్ బస్టర్‌ను అందుకున్నాడు. ఇంకా వీళ్లే కాకుండా.. దుల్కర్ ‘లక్కీ భాస్కర్’తో నాని ‘సరిపోదా శనివారం’తో మంచి విజయాలను ఖాతాలో వేసుకున్నారు. అయితే ఈ ఇయర్ హిట్ కాదు కదా.. అసలు సినిమానే లేకుండా 2024 ముగిస్తున్నారు టాలీవుడ్ హీరోలు వాళ్లేవరు అనేది చూస్తే..
మెగాస్టార్ చిరంజీవి
Chiranjeevi
అగ్రనటుడు చిరంజీవి నుంచి ఈ ఏడాది ఒక్క మూవీ కూడా రాకపోవడం విశేషం. గత ఏడాది భోళశంకర్ సినిమాతో షాక్ తిన్న చిరు.. ప్రస్తుతం గ్యాప్ తీసుకుని విశ్వంభర తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.
బాలకృష్ణ
Actor Balakrishna
గత ఏడాది భగవంత్ కేసరి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న బాలయ్య ఈ ఏడాది ఒక్క సినిమాకు కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురాలేదు. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు రావడంతో రాజకీయాల కోసం సినిమాలకు గ్యాప్ ఇచ్చారు బాలయ్య. అలా ఈ ఏడాదిని ఆయన మిస్సయ్యారు. ప్రస్తుతం బాలయ్య డాకు మహారాజ్ అనే సినిమా చేస్తున్నాడు. వాల్తేరు వీరయ్య సినిమాకు దర్శకుడు బాబీ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.
పవన్ కళ్యాణ్
Pawan Kalyan
పవర్ స్టార్‌గా అభిమానులను అలరించిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా తన బాధ్యతలను నిర్వర్తిస్తున్నాడు. అయితే పవన్ లైనప్‌లో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్న విషయం తెలిసిందే. ఓజీ సినిమాతో పాటు ఉస్తాద్ భగత్‌సింగ్, హరిహర వీరమల్లు సినిమాలు ఉన్నాయి. ఇందులో ఓజీ సినిమా ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు వస్తుందని అందరూ భావించారు. కానీ షూటింగ్ ఇంకా పెండింగ్ ఉండడంతో వాయిదా పడింది. దీంతో పవన్ కూడా ఈ ఏడాది ఖాతా తెరవలేదు.
రామ్ చరణ్..
Ram Charan
ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన రామ్ చరణ్ గత ఏడాది లాగానే ఈ ఏడాది కూడా ఖాతా తెరవలేదు. అప్పుడెప్పుడో ఆచార్య అంటూ ప్రేక్షకుల ముందుకు రాగా.. భారీ డిజాస్టార్‌ను అందుకుంది. దీంతో హిట్టు కొట్టాలనే కసితో దిగ్గజ దర్శకుడు శంకర్‌తో చేతులు కలిపాడు. వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న చిత్రం గేమ్ ఛేంజర్. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.
అగ్ర హీరోలే కాకుండా.. కుర్ర నటులలో నవీన్ పొలిశెట్టి, నాగ చైతన్య, నితిన్, సాయిదుర్గతేజ, అఖిల్, నాగశౌర్య, అడివి శేష్, బెల్లంకొండ సాయిశ్రీనివాస్, వైష్ణవ్ తేజ్‌లు కూడా ఈ ఏడాది ఖాతా తెరవకుండానే వెళుతున్నారు. నాగ చైతన్య నటించిన తండేల్ చిత్రం మొదట ఈ ఏడాదే విడుదల అవుదాం అనుకున్నా.. పుష్ప ఎఫెక్ట్‌తో వచ్చే ఏడాదికి షిఫ్ట్ అయ్యింది.