‘నటుడిగా ప్రతీ సినిమాలో వైవిధ్యం ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తా. కథాంశాలపరంగా కూడా కొత్తదనానికి పెద్దపీట వేస్తా. ఒకే రకమైన కథల్ని అస్సలు రిపీట్ చేయను’ అన్నారు హీరో ప్రియదర్శి. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘మిత్రమండలి’ నేడు ప్రేక్షకుల ముందుకొస్తున్నది. విజయేందర్ దర్శకత్వంలో సప్త అశ్వ మీడియా వర్క్స్ సంస్థ నిర్మించింది. ఈ సందర్భంగా బుధవారం ప్రియదర్శి విలేకరులతో ముచ్చటించారు.
దర్శకుడు విజయేందర్ కుల వ్యవస్థ మీద సెటైరికల్‌గా ఈ కథ రాసుకున్నాడు. ఓ ఫిక్షనల్ టౌన్లో ఈ కథ నడుస్తుంది. నలుగురు స్నేహితుల చుట్టూ నడిచే ఈ కథలో కావాల్సినంత వినోదంతో పాటు సందేశం కూడా ఉంటుంది. కుల వ్యవస్థ అనే అంశాన్ని తీసుకున్నా..ఇందులో ఎవరి మనోభావాల్ని దెబ్బతీసే విషయాలు ఉండవు.