సమకాలీన తెలుగు సినీరంగంలో గీత రచయిత కృష్ణకాంత్ కలం మెలోడీ గీతాలకు పెట్టింది పేరు. అర్థవంతమైన సాహిత్యంతో లోతైన భావాలను ఆవిష్కరిస్తూ ఆయన రాసిన పాటలు చక్కటి ఆదరణ పొందాయి. నేడు కృష్ణకాంత్ జన్మదినం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘గత ఏడాది రాసిన పాటల్లో ‘అడిగా అడిగా’ (హాయ్ నాన్న) పాట ఎంతో సంతృప్తినిచ్చింది. అణువణువు (ఓం భీం బుష్), అంబరాల వీధిలో (ఏఆర్ఎం) పాటలకు మంచి స్పందన దక్కింది’ అన్నారు. ఈ ఏడాది రాసిన పాటలన్నీ చార్ట్‌బస్టర్స్ కావడం ఆనందంగా ఉందని, తెలుగుతో పాటు తమిళ, మలయాళ డబ్బింగ్ చిత్రాలకు సంగీత ప్రియుల్ని మెప్పించే పాటలు రాయడం అదృష్టంగా భావిస్తున్నానని కృష్ణకాంత్ తెలిపారు.
గతంలో సినిమా కథలు సాధారణ ప్రేక్షకుడికి బాగా కనెక్ట్ అయ్యేవని, అందుకే ఆ పాటలు చిరకాలం గుర్తుండిపోయాయని, అవకాశం దొరికితే తాను కూడా అలాంటి పాటలు రాసే ప్రయత్నం చేస్తున్నానని తెలిపారు. ఈ ఏడాది స్క్రిప్ట్ రైటర్‌గా ప్రయత్నాలు చేస్తున్నానని, దర్శకత్వం కూడా చేయాలనే ఆలోచన ఉందన్నారు. ప్రస్తుతం చేస్తున్న సినిమాల గురించి మాట్లాడుతూ ‘ప్రభాస్, హనురాఘవపూడి సినిమాలో రెండు పాటలకు వర్క్ మొదలుపెట్టాం. అలాగే రాజాసాబ్, రామ్ పోతినేని, విజయ్ దేవరకొండ-గౌతమ్తిన్ననూరి కాంబినేషన్లో రానున్న సినిమాకు పాటలు రాస్తున్నా’ అన్నారు.